అక్రమ దందాకు రైట్ రైట్ | Illegal danda Right Right | Sakshi
Sakshi News home page

అక్రమ దందాకు రైట్ రైట్

Published Fri, Nov 22 2013 2:17 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Illegal danda Right Right

దొడ్డు రకాల మాటున మిల్లర్ల బాగోతం
 =సన్నాలను రాష్ర్టం దాటిస్తున్న మాఫియూ
 =అనుమతులతో కొందరు... లేకుండా మరికొందరు
 =అధికారులతో కుమ్మక్కు... రూ. లక్షల్లో ముడుపులు
 =చెక్‌పోస్టు సిబ్బందికి ముడుపుల గాలం

 
 దొడ్డు బియ్యం చాటున సన్న బియ్యం తరలిపోతున్నాయి. జిల్లాలో ఈ దందా కొంతకాలంగా జోరుగా సాగుతోంది.  సివిల్ సప్లైస్, మార్కెటింగ్, వాణిజ్య శాఖలతోపాటు విజిలెన్స్ అధికారుల కళ్లు గప్పడం... 22 చెక్‌పోస్టులు దాటుతూ అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగడం వెనుక పలువురి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మాఫియూ తరహాలో జరుగుతున్న ఈ బాగోతంపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం...
 
వరంగల్, న్యూస్‌లైన్: జిల్లాలో బియ్యం దొంగల హవా నడుస్తోంది. పలు శాఖల అధికారులతో కలిసి బియ్యం అక్రమ రవాణాకు దారులు తెరిపించి అందినకాడికి దండుకుంటున్నారు. దొడ్డు బియ్యం పేరిట అనుమతులు తీసుకుని తమ పలుకుబడితో సన్న రకాలను సరిహద్దులు దాటిస్తున్నారు. కొందరు అనుమతులు తీసుకోకుండా కూడా దందా కొనసాగిస్తున్నారు. పన్నులు చెల్లించకుండా సర్కారు ఖజానాకు గండి కొడుతున్నారు. పలువురు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లైస్, వాణిజ్య పన్నులు, మార్కెటింగ్, చెక్‌పోస్ట్ అధికారులు, సిబ్బందిని ముడుపులతో మచ్చిక చేసుకుని మాఫియూ తరహాలో వ్యాపారం చేస్తున్నారు. బస్తాల అడుగు భాగాన సన్న బియ్యం... పైన దొడ్డు బియ్యం లోడ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో మిల్లర్ల అక్రమ బాగోతం నిత్యం నిరాటంకంగా కొనసాగుతోంది.
 
 పారిన వ్యాపారుల పాచిక
 
 సన్న బియ్యం ధరల అదుపునకు ప్రభుత్వం షరతులు విధించింది. సన్న బియ్యాన్ని కేవలం రాష్ట్రంలోనే అమ్ముకోవాలని... దొడ్డు బియ్యాన్ని అనుమతి తీసుకుని రాష్ర్టం బయట అమ్ముకోవచ్చని మిల్లర్లను ఆదేశించింది. జిల్లాలో అక్టోబర్ నుంచి సన్న బియ్యం ఎగుమతికి బ్రేక్ పడింది. ఇక్కడే వ్యాపారులు తమ వ్యాపార సూత్రాలను అమలు చేశారు. జిల్లాలో దొడ్డు రకం బియ్యం ఎక్కువగా ఉన్నాయని.... వాటిని ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు అవకాశమివ్వాలంటూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సర్కారు  లెవీ పెట్టిన తర్వాత 25 శాతం మేర దొడ్డు రకం బియ్యూన్ని అమ్ముకునే వీలు కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న మిల్లర్లు అక్రమాలకు తెరలేపారు.
 
 వే బిల్లుల్లో అక్రమాలతో షురూ
 
 లెవీకి పెట్టిన తర్వాత 25 శాతం అమ్ముకునే వీలున్న మిల్లర్లు... ఇదే ముసుగులో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. మిల్లు నుంచి లారీ బయటకు వచ్చిందంటే... ట్రక్ షీట్, వే బిల్లులు వాహనాల వెంట ఉండాలి. ట్రక్ షీట్‌లో ఏ రకమైన బియ్యం... ఏ మిల్లు నుంచి ఎక్కడకు వెళ్లుతున్నాయనే విషయం స్పష్టంగా ఉంటుంది.
 
 వే బిల్లు తీసుకుంటే ఐదు శాతం పన్ను తప్పనిసరిగా చెల్లించాలి. ఒకసారి వే బిల్లు తీసుకుంటే ఒక వాహనానికి ఒకేసారి మాత్రమే పనికివస్తుండడంతో మిల్లర్లు ఇక్కడే అక్రమాలకు తెరతీశారు. పలువురు అధికారులు, సిబ్బందితో కుమ్మక్కై మాయ చేసి తేదీలు లేకుండా... నంబర్లు లేకుండా వే బిల్లులు తీసుకున్నారు. ఇవి మిల్లర్ల వద్దే ఉంటుండడంతో వారు అవసరాన్ని బట్టి తేదీలు... నంబర్లు వేసుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. వే బిల్లుల్లో తేదీలు, నంబర్లను ఓ రసాయనంతో తుడిపేస్తున్నట్లు తెలిసింది. ఇక ఇతర రాష్ట్రాల్లో బియ్యం అమ్మకాలకు అనుమతులు తీసుకున్న పక్షంలో సివిల్ సప్లైస్ అధికారి ఆ మిల్లులో దగ్గరుండి వాహనాల్లో బియ్యాన్ని లోడ్ చేసి పంపించాలి. కానీ... వ్యాపారులతో లాలూచీ పడిన సదరు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో మిల్లర్లు బస్తాల అడుగు భాగంలో సన్న బియ్యం... పై భాగంలో దొడ్డు బియ్యం లోడ్ చేసి యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
 
 వరంగల్ టూ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక
 
 జిల్లాలోని సన్న బియ్యూన్ని మిల్లర్లు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పరకాల.. భూపాలపల్లి... కాళేశ్వరం మీదుగా మహారాష్ట్ర, వరంగల్.. ఖమ్మం మీదుగా ట్రెరుున్ రూట్‌లో తమిళనాడు, సిద్ధిపేట.. బీదర్ మీదుగా కర్ణాటక రాష్ట్రాలకు లారీల్లో తరలుతున్నారుు.
 
 చెక్‌పోస్టులు ఉన్నా...
 
 జిల్లావ్యాప్తంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 22 శాశ్వత చెక్‌పోస్టుల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. నర్సంపేట, కొడకండ్ల, జనగాం, నెక్కొండ, స్టేషన్ ఘన్‌పూర్‌లో ఒక్కటి చొప్పున, పరకాల, ఆత్మకూర్, చేర్యాల, వర్ధన్నపేటలో రెండు చొప్పున, ములుగు, తొర్రూరు, కేసముద్రంలో మూడు చొప్పున ఉన్నారుు. కానీ... ఎక్కడా సన్న బియ్యం తరలుతున్న లారీలు పట్టుడబడక పోవడం ఆశ్చర్యం వేయకమానదు. ఇవే కాదు... ఎల్లాపూర్, ఖమ్మం రోడ్‌లోని దంతాలపల్లి వద్ద, ఏటూరునాగారం హైవే, జనగామ వద్ద వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుత మూడు నెలల పాటు తాత్కాలిక చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలి. అధికారులు వీటిని పక్కనపడేసి... నెలలో ఒక్కటి, రెండు రోజులపాటు నామమాత్రపు తనిఖీలతో సరిపుచ్చుతుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.
 
 రోజుకు రూ. 11,25,000 గండి
 
 మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 75 శాతం ప్రభుత్వానికి లెవీ పెట్టాలి. 25 శాతం ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయించుకోవచ్చు. వీటిలోనూ 12.5 శాతం రాష్ట్రంలో, మరో 12.5 శాతం ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవాలి. ఈ మేరకు ఇతర ప్రాంతాల్లో బియ్యం విక్రరుుంచాలంటే వాణిజ్య పన్నుల శాఖకు నాలుగు శాతం, మార్కెటింగ్ శాఖకు ఒక శాతం పన్ను చెల్లించాలి. పలువురు మిల్లర్లు ఈ నిబంధనలను కాలరాయడమే కాకుండా ప్రభుత్వానికి ఒక్క రూపారుు పన్ను సైతం చెల్లించకుండా బియ్యూన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అనుమతులు తీసుకుని పంపించే దొడ్డు రకం బియ్యానికి సంబంధించి 20 టన్నులుండే ఒక లారీకి రూ. 25 వేల వరకు పన్ను చెల్లించాలి. ప్రతి రోజూ జిల్లా నుంచి సుమారు 45 వరకు లారీలు అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన రోజుకు రూ. 11,25,000 మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది.
 
 వాటాలవారీగా ముడుపులు
 
 పలువురు సివిల్ సప్లైస్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, మార్కెటింగ్, వాణిజ్య శాఖల అధికారులతో మిల్లర్లు ముఠాగా ఏర్పడి... జిల్లాలోని ప్రభుత్వ పెద్దల సహకారంతో ఈ దందా కొసాగిస్తున్నట్లు సమాచారం.  ఈ మేరకు వ్యాపారులు వాటాల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు ముడుపులు అందజేస్తున్నట్లు తెలిసింది. ఒక్క లారీ బియ్యం సరిహద్దులు దాటి అమ్ముకుంటే... మిల్లర్లు అందరూ కలిసి కక్కుర్తి పడిన జిల్లాస్థారుు అధికారులకు నెలలో ఒకసారి కొంత ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక ద్వితీయ శ్రేణి అధికారులు, సిబ్బంది... లారీకి కొంత మేర తీసుకుంటున్నట్లు సమాచారం. వ్యాపారులు వీరికి నెలకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేలు చేతిలో పెడుతున్నట్లు వినికిడి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement