- అధికారులు, తమ్ముళ్లు కుమ్మక్కు
- సర్కార్‌కు రూ.6 కోట్లు
- అక్రమార్కులకు రూ.5 కోట్లు
- పొట్టేపాళెం రీచ్ నుంచి ఇష్టారాజ్యంగా అక్రమ రవాణా
- సూళ్లూరుపేట, పొదలకూరు నుంచి చెన్నైకు ఇసుక తరలింపు
- డ్వాక్రా సంఘాల పేరుతో అధికార పార్టీ వర్గీయులకు లెసైన్స్ ఇచ్చిన సర్కారు!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇసుక అక్రమ రవాణా తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. డ్వాక్రా సంఘాల పేరుతో ఇసుకను కొందరు ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పాలసీ వారికి వరంగా మారింది. ప్రభుత్వానికి ఆదాయం మాటెలా ఉన్నా... అక్రమార్కులు మాత్రం కోట్లల్లో దండుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 42 రీచ్‌ల నుంచి ఇసుక తరలింపునకు అనుమతి ఉంది.
ఇప్పటివరకు ఈ రీచ్‌ల ద్వారా లక్ష క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుకను తవ్వి విక్రయించారు. ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.6 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ రీచ్‌ల ద్వారా అక్రమంగా ఇసుక తరలింపు ద్వారా రూ.5 కోట్లకుపైనే అక్రమంగా సంపాదించుకున్నట్లు సమాచారం. అధికారులు, అధికారపార్టీ నేతలు కుమ్మక్కై ఇసుకను ఇష్టారాజ్యంగా తరలించి సొమ్ముచేసుకున్నారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టేపాళెం ఇసుక రీచ్ వద్ద పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే బుధవారం కలెక్టర్ జానకి, ఎస్పీ సెంథిల్‌కుమార్ ఇసుకరీచ్‌లను సందర్శించారు. అనుమతులు లేకుండా 8 జేసీబీలతో ఇసుకను తోడుతుండటాన్ని గమనించి వాటిని సీజ్‌చేశారు. పొట్టేపాళెం ఇసుక రీచ్ నుంచి అనధికారికంగా 70 నుంచి 80 లారీలు, టిప్పర్ల ద్వారా చెన్నైకి తరలించి సొమ్ముచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నాలుగు యూనిట్ల ఇసుకకు అనుమతి ఉంటే.. అనధికారికంగా 10 యూనిట్ల ఇసుకను తరలించినట్లు వెల్లడించారు.
రాత్రిపూట అక్రమ రవాణా...
ఇసుక అక్రమ రవాణా మొత్తం రాత్రిపూటే జరుపుతున్నారు. నెల్లూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, పొదలకూరు పరిధిలో ఈ అక్రమ రవాణా అధికంగా ఉన్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలపైన ఇసుకను తరలించటానికి వీల్లేదు. అయితే జిల్లాలో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి ఆరుగంటలపైన ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొందరు అధికారుల సహకారంతో జేసీబీలను పిలిపించుకుని టిప్పర్లకు నింపుకుని తరలిస్తున్నట్లు సమాచారం.
శ్రీకాళహస్తి పేరున డీడీ తీసుకుని.. చెన్నైకి తరలిస్తున్నట్లు తెలిసింది. రెండురోజుల క్రితం అధిక లోడుతో ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని ఆపిన ఓ పోలీసు అధికారిపై టీడీపీ నేతలు కొందరు జులుం ప్రదర్శించినట్లు సమాచారం. అధికలోడుతో ఇసుకను తరలించటం తప్పని పోలీసు అధికారి డ్రైవర్‌ను మందలించారు. విషయం తెలుసుకున్న తమ్ముళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను తిట్టటం తప్పని ఆ పోలీసు చేత క్షమాపణ చెప్పించటం గమనార్హం.
సీసీ కెమెరాలేవీ?
ఇసుక తరలింపునకు కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఇసుక రీచ్‌ల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లతోపాటు.. అక్రమ రవాణా జరుగకుండా నిలువరించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇంతవరకు ఏ ఒక్క ఇసుక రీచ్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోందని డ్వాక్రా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కోవూరు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
ఇసుక రీచ్‌లు డ్వాక్రా సంఘాల పేరుమీద ఉండటంతో... వారు రీచ్‌ల వద్ద కాపలా ఉండలేకపోతున్నారు. మహిళలు రాత్రిపూట కాపలా ఉండాలన్నా అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినా.. అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందని మహిళలు విమర్శిస్తున్నారు.
ఇసుకాసురులు
Published Fri, Jan 2 2015 2:57 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement