అనుచితం
ఆగని ఇసుక దందా నిన్నటి వరకు డ్వాక్రా సంఘాల పేరుతో దోపిడీ
నేడు ఉచితం పేరుతో దందా అక్రమాలను కప్పి పుచ్చడానికే నెల రోజుల ఉచిత పథకం
‘పచ్చదండు’ ఇసుక దందా ఆగడం లేదు. నిన్నటి వరకు డ్వాక్రా సంఘాల మాటున దోపిడీ చేసిన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు ఉచితం పేరుతో లూటీకి సిద్ధమయ్యారు. గతంలో జరిగినఅక్రమాలను కప్పిపుచ్చడానికే ప్రభుత్వం ‘నెలరోజుల ఇసుక ఫ్రీ’ పథకా నిప్రవేశపెట్టిందన్న విమర్శలువిన్పిస్తున్నాయి. ఇసుక విక్రయాలు ప్రారంభం నుంచి ముగిసేవరకు ఎంత మేర అక్రమంగా తరలిందో తేల్చకుండా.. దందా చేసిన తమ్ముళ్లను కాపాడటానికే ఉచిత పథకాన్ని అమలుచేస్తోందనివిపక్ష నేతలు మండిపడుతున్నారు.
ధర్మవరం: ‘ఇసుక ఉచితం’ అనేది ఈ రోజు కొత్తేమీ కాదు. గతంలో ఇసుకను గ్రామీణులు వంకలు, వాగుల నుంచి ఉచితంగానే తీసుకెళ్లేవారు. ట్రాక్టర్ బాడుగ, కూలీల ఖర్చు మాత్రమే చెల్లించేవారు. ఇసుకకు ఎక్కడా నగదు చెల్లించి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తామని చెబుతోంది. దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఉపయోగమూ లేదు. ప్రజలు నేరుగా ఇసుకను తవ్వుకునే అవకాశం లేదు. ఎప్పటిలాగే అధికార పార్టీ నాయకులు, దళారులను ఆశ్రయించాలి. ఇప్పటికే ‘తమ్ముళ్లు’ ఇసుకను వేరెవరూ తోలకుండా అంతా తామే తరలించాలని పథక రచన చేశారు. ఇందుకోసం సిండికేట్‌గా ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఇష్టారాజ్యంగా తరలింపు
టీడీపీ నేతలు ఇప్పటి వరకు డ్వాక్రా సంఘాల పేరుతో ఇసుకను ఇష్టారాజ్యంగా తరలించి జేబులు నింపుకున్నారు. ఇప్పుడు ఉచితమని చెప్పడంతో నేరుగా దందాకు సిద్ధమవుతున్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలం కొత్తకోట, పోతులనాగేపల్లి, మల్లాకాల్వ, బత్తలపల్లి మండలం రామాపురం, కోడేకండ్ల, ఉప్పర్లపల్లి, ముదిగుబ్బ మండలం సంకేపల్లి, కొడవండ్లపల్లి, రాఘవంపల్లి, తాడిమర్రి మండలం పెద్దకోట్ల, చిన్నచిగుళ్లరేవు, మోదుగులకుంట తదితర గ్రామాల సమీపంలో చిత్రావతి నదిలో ఇసుక లభ్యత అధికంగా ఉంది. ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులు నియోజకవర్గ నాయకులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
దీంతో సదరు నాయకులు పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా ప్రారంభించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని వేదావతి హగరి, శింగనమల నియోజకవర్గంలోని పెన్నానది పరీవాహక ప్రాంతాల నుంచి కూడా ఇసుక అక్రమ రవాణాకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.