దారితప్పుతున్న రేషన్ బియ్యం !
నరసనన్నపేట రూరల్ :నిత్యావసర సరుకుల డిపోల ద్వారా పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. బడుగుల కడుపు నింపాల్సిన తిండి గింజలు బడాబాబులకు ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. తెల్లకార్డులపై కేజీ బి య్యం రూపాయికే ప్రభుత్వం పంపిణీ చేస్తుండగా వీటిని కొందరు నల్ల బజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి కొందరు రేషన్ డీలర్లు కూడా సహకరిస్తుండటంతో అక్రమార్కుల పంట పండుతోంది. నరసన్నపేట మండలం మడపాం వెంకటేశ్వరా మోడరన్ రైస్ మిల్లులో రెండు రోజుల క్రితం బయటపడ్డ బాగోతమే దీనికి ఉదాహరణ. అలాగే పెద్దపాడులో రెండు మిల్లుల్లో నూ, బైరి సింగుపురం వద్ద ఒక మిల్లులోనూ రేషన్ బియ్యూన్ని అధికారులు ఇటీవల గుర్తిం చారు.
గతేడాదిలో పాలకొండ, కొత్తూరుల్లో రెండు మిల్లుల్లో అధిక మొత్తంలో రేషన్ బియ్యం అధికారులకు పట్టుబడ్డాయి. ఈవి ధంగా జిల్లాలో రైస్ మిల్లు యజమానులు అనేక మంది ఈ అక్రమ వ్యాపారం చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారనే విమర్శలు వస్తున్నారుు. ఇప్పటికే జిల్లా విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంట్ దీనిపై దృష్టి సారించి దాడులు నిర్వహిస్తున్నా.. మరో వైపు గుట్టు చప్పుడు కాకుండా చీకటి వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది. నరసన్నపేట పరసర ప్రాంతాల్లో ఉన్న మరికొన్ని మిల్లుల యజమానులు ఇదే పని చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రాజకీయలకు అతీతంగా దాడులు మరింతగా చేస్తే అసలు గుట్టు బయడపడే అవకాశాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు.
మూడు పువ్వులు..ఆరు కాయలుగా..
తెల్ల కార్డులదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తున్న బియ్యాన్ని అక్రమార్కులు దక్కించుకొని, రీసైక్లింగ్ చేసి రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ వ్యవహరం పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యహరిస్తుండటంతో బియ్యం మిల్లులు చేస్తున్న ఈ చీకటి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది. నాలుగు రోజుల క్రితం పోలాకి మండలం చీడివలసలో ఒక వ్యాపారి ఇంటిలో ఐదు క్వింటాళ్ల బియ్యం, నరసన్నపేట మండలం మడపాంలో రైస్‌మిల్లులో ఏకంగా 233 క్వింటాళ్ల బియ్యం విజిలెన్సు ఎన్‌ఫోర్సు మెంట్ సీఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బృందం గుర్తించారు.
ఇలా సేకరిస్తున్నారు...
మార్కెట్‌లో సూపర్ ఫైన్ బియ్యం ధర చుక్కలను తాకుతున్నారుు. క్వింటా రూ. నాలుగు వేలకు పైనే పలుకుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, మిల్లింగ్ చేసి బియ్యం విక్రయిస్తే వచ్చే లాభాలు అంతంత మాత్రమే. ఇదే పీడీఎస్ బియ్యాన్ని అడ్డదారుల్లో సేకరించి కాస్తా మెరుగు పట్టి అమ్మితే వచ్చే లాభం ఎక్కువ. దీంతో కొంతమంది వ్యాపారులు రేషన్ బియ్యంపై దృష్టిసారించారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న బియ్యం మిల్లులోనూ, అధికార పార్టీ అండ ఉన్న కొందరు మిల్లర్లు ఈ పనులకు పూనుకుంటున్నట్టు తెలిసింది. నరసన్నపేట, శ్రీకాకుళం.. ఇతర ప్రాంతాలను వ్యాపార కేంద్రాలుగా చేసుకొని ఈ చీకటి వ్యాపారం చేస్తున్నారు. తెల్లకార్డు వినియోగదారుల నుంచి దళారుల ద్వారా బియ్యూన్ని సేకరిస్తున్నారు. ప్రభుత్వం నామమాత్రమైన ధరలకు బియ్యాన్ని పంపిణీ చేస్తుంది.
కొంత మంది బియ్యం తీసుకోవడంలేదు. మరికొంత మంది తీసుకున్న బియ్యాన్ని వ్యాపారులకు అమ్మేస్తున్నారు. అలాగే డీలర్లు కూడా కార్డుదారులు తీసుకెళ్లని బియ్యాన్ని తప్పుడు రికార్డులు చూపించి వ్యాపారులకు ఇస్తున్నారు. ఈవిధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని కేజీ రూ. 12 నుంచి 14 రూపాయల వరకూ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని రైస్ మిల్లుల్లో మరో సారి మరపట్టించి వివిధ బ్రాండ్ల పేరుతో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. క్వింటాల్‌కు కనీసం రూ. వెయ్యి ఆదాయం పొందుతున్నారు. మరికొందరు మిల్లుల యజమానులు సన్న బియ్యంలో మరపట్టిన రేషన్ బియ్యాన్ని కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బియ్యాన్ని విశాఖ, విజయనగరంలో పాటు జిల్లాలోనూ విరివిగా అమ్మకాలు సాగిస్తున్నారు. తాజాగా తుపాను బాధితులకు ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో కార్డుదారులకు 25 కేజీలు, 10 కేజీల చొప్పున్న పంపిణీ చేశారు. ఈ బియ్యం కూడా పక్క దారి పట్టి రైస్ మిల్లులకు చేరుతున్నాయి. దీనిపై మరింత నిఘా పెంచితే మొత్తం వ్యవహరం బయటపడుతుందని పలువురు అంటున్నారు.