ప్రతీకాత్మక చిత్రం
శ్రీకాకుళం పాతబస్టాండ్ /గార : ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టుపట్టించేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎనిమిది సరుకుల నుంచి రెండు సరుకులకు కుదించగా, తాజాగా శతశాతం రేషన్ పంపిణీ చేయాల్సి ఉండగా, 90 శాతమే డీడీలు కట్టాలని ఆదేశించింది. అంటే మిగిలిన 10 శాతం రేషన్ అందకుండా చేస్తుందన్నమాట. ఇలా మున్ముందు మొత్తం పేదలను ప్రజా పంపిణీ వ్యవస్థకు దూరం చేసేఎత్తుగడ చేస్తోంది.
జిల్లాలో 8,27,468 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో తెలుపురంగు 7,76,552, అంత్యోదయ 49,943, అన్నపూర్ణ కార్డులు 973 ఉన్నాయి. కార్డుదారుల్లో సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి అయిదు కిలోల బియ్యాన్ని, కిలో బియ్యాన్ని అందిస్తున్నాయి. దీనికోసం కోట్లాది రూపాయల ప్రజాధనం కేటాయిస్తున్నారు. జిల్లా మొత్తంగా ఈ రేషన్ బియ్యాన్ని ప్రజలకు 98 శాతం మేర సక్రమంగా పంపిణీ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
దీనిపై ప్రజల్లో సంతృప్తి మాత్రం 75 శాతం మించడం లేదని సంబంధిత అధికారులపై, డిపో డీలర్లుపై ప్రభుత్వ వర్గాలు, సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. 98 శాతం సక్రమంగా పంపిణీ అవుతున్నా ఎందుకు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం విడ్డూరమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల కేవలం 90 శాతం మేర డీడీలు కట్టాలని డీలర్లను ఆదేశించింది. ఈ లెక్కన జిల్లాలో 83,000 కార్డుదారులకు బియ్యం ఇవ్వబోమని చెప్పినట్టే.
అయితే ఉండిపోయిన 10 శాతం మేర నిరుపేదలే కచ్చితంగా ఉంటారని అధికారులు అనధికారికంగానే చెబుతున్నారు. ఎందుకంటే ఇంతో అంతో ఉన్నవారే ప్రభుత్వ పథకాలకు ముందుంటారన్నది నానుడి. మిగిలిన 10 శాతం 1,200 మెట్రిక్ టన్నులు పేదలకు చేరడం లేదు. దీంతో పేద కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే నిరుపేదలకు అన్యాయం చేసినట్టేనని, ప్రజాపంపిణీ వ్యవస్థ భ్రష్టుపట్టేలా టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చివరకు బియ్యం, పంచదారే..
జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లక్షలాది మంది నిరుపేదలకు బియ్యం, పంచదార అందుతున్నాయి. గత ప్రభుత్వం ఎనిమిది సరుకులు సబ్సిడీల రూపంలో ధర తగ్గించి పేదలకు అందించేవి. దీని ద్వారా పేదలకు ఇంట్లోకి అవసరమైన ముఖ్య సరుకులు అందేవి. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కో సరుకు తగ్గిస్తూ వచ్చింది.
ఇందులో కేంద్రం కిరోసిన్ నిలిపేస్తే మిగిలిన సరుకులకు మాత్రం సీఎం చంద్రబాబు ప్రభుత్వం కత్తెర వేసింది. ఈ వ్యతిరేకతను తగ్గించేందుకు సంక్రాంతి, క్రిస్‌మస్, రంజాన్ పండగలకు మాత్రం చంద్రబాబు డిజిటల్ బొమ్మ, పసుపు రంగు సంచులు పెట్టి మరీ ఉచితంగా సరుకులు ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఇలా ప్రజల్లో సంతృప్తి పెరిగితే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బాగుంటందన్న సంగతి అధికారులకు తెలుసు.
Comments
Please login to add a commentAdd a comment