సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ఆహార భద్రతా కార్డు కలిగిన పేద కుటుంబాలకు ఉచితంగా బియ్యంతో పాటు నిత్యవసర సరుకుల కోసం రూ.1500 నగదు అందనుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిరుపేదలు నిత్యవసర వస్తువుల కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాలకు ఉచితంగా బియ్యంతో పాటు నగదు అందజేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
9.80 లక్షలపైకు పైగా కార్డులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆహార భద్రత కార్డు కలిగిన 9,80,257 కుటుంబాలున్నాయి. అందులో 40 లక్షలకు పైగా సభ్యులున్నారు. కార్డులోని ఒక్కో సభ్యుడికి 12 కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే (కార్డులోని సభ్యులు) అన్ని కిలోలు ఉచితంగా బియ్యం అందజేయనున్నారు. ప్రతి కార్డు కలిగిన కుటుంబానికి నిత్యవసర వస్తువుల కోసం రూ.1,500ల చొప్పన నగదును అందిస్తారు. ఇందుకు రూ.147 కోట్ల పైచిలుకు ఖర్చవుతుంది. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అర్బన్ ప్రాంతాలు వస్తాయి. మొత్తం మీద 12 సర్కిళ్లున్నాయి. అర్బన్ వారీగా పరిశీలిస్తే హైదరాబాద్ జిల్లా పరిధిలో 5,80,808 ఆహార భద్రత కార్డులు, 21,77,934 యూనిట్లు రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ అర్బన్ పరిధిలో 1,87.969 కార్డులు 6,24,702 యూనిట్లు, మేడ్చల్ జిల్లాలోని బాలనగర్, ఉప్పల్ అర్బన్ పరిధిలో 3,65,241 కార్డులు, 12,24,830 యూనిట్లున్నాయి. వాస్తవంగా మార్చి నెల సరుకుల పంపిణీ గడువు 15వ తేదీతో ముగిసింది. ఇప్పటికే ఏప్రిల్ మాసం సరకుల కోటా కోసం డీలర్లు సిద్ధమవుతున్నారు. కాగా కరోనా కట్టడిలో భాగంగా ఆహార భద్రత కార్డుదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కార్డుదారులకు రూ.1లకు కిలో చొప్పన యూనిట్‌కు ఆరు కిలోల అందిస్తోంది. తాజాగా యూనిట్‌కు 12 కిలోల చొప్పున ఉచితంగా అందజేసేందుకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment