సాక్షి, బెంగళూరు: కరోనావైరస్ మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్ కొనసాగింపు అంచనాలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. లాక్‌డౌన్ పొడిగిస్తే ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదముందని నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
కోవిడ్-19 ప్రతిష్టంభన ఎక్కువ కాలం కొనసాగితే అనధికారిక లేదా అసంఘటిత రంగంలోని కార్మికులు చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోతారన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశ మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, లాక్‌డౌన్ ఆంక్షలను ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సంక్రమణకు గురయ్యే వారిని జాగ్రత్తగా చూసుకుంటూ, సామర్థ్యం ఉన్నవారికి తిరిగి పనిని ప్రారంభించే వీలు కల్పించాలని ఆయన అన్నారు. లేదంటే ఆకలి కారణంగా సంభవించే మరణాలు కరోనా వైరస్ మరణాలను మించిపోతాయన్నారు.
వ్యాపారాలపై కరోనా వైరస్ విస్తరణ, లాక్‌డౌన్ ప్రభావం గురించి మూర్తి మాట్లాడుతూ, చాలా సంస్థలు తమ ఆదాయంలో 15-20 శాతం కోల్పోయారన్నారు. ఇది ఆదాయపు వస్తువు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ఇండియా లాంటి దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగించే పరిస్థితులు లేవు. మరింత కాలం ఈ పరిస్థితి కొనసాగితే కరోనా చావుల కంటే ఆకలి చావులే ఎక్కువయ్యే ప్రమాదముందన్నారు. అసంఘటిత రంగం, స్వయం ఉపాధి పొందుతున్న వారు సుమారు 20 కోట్లమంది ఉన్నారని, లాక్‌డౌన్ పొడిగిస్తే వీరంతా మరింత సంక్షోభంలోకి కూరుకు పోతారని మూర్తి హెచ్చరించారు. (లాక్‌డౌన్ ఎఫెక్ట్ : మైక్రోసాఫ్ట్ దూకుడు)
ఇతర అభివృద్ధి దేశాలతో పోలిస్తే భారత దేశంలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉంది. ప్రస్తుతం మరణాల రేటు 0.25 నుంచి 0.5 శాతం మధ్యలో ఉన్నాం. అయితే అనేక రకాల కారణాలతో దేశంలో ప్రతి సంవత్సరం 90 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ మరణాల్లో పావు వంతు శాతం కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నాయన్నారు. ఈ లెక్కన గత రెండు నెలల్లో వెయ్యి కరోనా మరణాలతో పోలిస్తే కరోనాపై అంత భయాందోళన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి కొత్త మార్గాలను అన్వేషించాలి, కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేయాలని మూర్తి వ్యాపార వర్గాలకు సూచించారు. (కరోనా కట్టడిలో కొత్త ఆశలు : ఈ మందుపై ప్రశంసలు)
Comments
Please login to add a commentAdd a comment