ఇది సీఎం కోటా!
ఆధార్ ఉంటేనే రేషన్ అన్నారు. సెప్టెంబర్ కోటాను కట్ చేసేశారు కూడా. కోటా అందని కార్డుదారులు లబోదిబోమంటున్నారు. డీలర్లతో వాగ్వాదాలకు దిగుతున్నారు. అయినా అధికారులు చలించలేదు. ఇంతలో సీఎం పర్యటన ఖరారైంది. ఆయన సమక్షంలో బాధితులు నిలదీస్తే ఇబ్బంది అని భావించారో.. ఏమో.. ఆధార్ అనుసంధానం చేసుకోని వారికి కూడా పూర్తి రేషన్‌ను ఆదరాబాదరాగా విడుదల చేశారు. ఈ కరుణ ఈ ఒక్క నెలకే పరిమితమని అధికారులు తేల్చిచెప్పడంతోనే ఇది సీఎం కోటా అని అర్థమైపోయింది. అంటే పాలకులు వస్తే తప్ప.. అధికారులు కరుణించరన్నమాట!
శ్రీకాకుళం పాతబస్టాండ్: పాలకులు పస్తున్నారంటే ఒకటే హడావుడి. రోడ్లు సుందరంగా తయారవుతాయి. తాత్కాలికంగానైనా ప్రజలకు కొన్ని సౌకర్యాలు సమకూరుతాయి. అధికారులు వారిపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తారు. ఈ ఆర్భాటమంతా ఎందుకంటే.. సీఎంను ప్రజలు నిలదీస్తే.. ఆ ప్రభావం అధికారుల మీద పడుతుంది. అది జరక్కుండా ఉండాలనే ఈ ఆపసోపాలు. ఈ విషయం మరోసారి రుజువైంది. అదనపు రేషన్ కోటా విడుదల చేయడమే దీనికి నిదర్శనం. ఆధార్ అనుసంధానం చేసుకోని రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ నెల బియ్యం, ఇతర రేషన్ సరుకుల సరఫరా నిలిపివేశారు. ఫలితంగా జిల్లాలో సుమారు 3 లక్షల యూనిట్లు రద్దయ్యాయి. దీనిపై కార్డుదారులు, డీలర్లు, ప్రతిపక్షం నుంచి తీవ్ర వ్యతిరే కత వెల్లువెత్తినా అధికారు లు పట్టించుకోలేదు. ప్రభు త్వ ఆదేశాలంటూ చేతులెత్తేశారు.
ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారైంది. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులకు కార్డుదారుల నిరసనలు గుర్తుకొచ్చాయి. సీఎం పర్యటనలోనూ ఆ నిరసన గళాలు వినిపిస్తే ఇబ్బందని భావించిన వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల వరకు ఆధార్ లేనివారికి కూడా రేషన్ ఇచ్చేయాలని నిర్ణయించారు. ఆగస్టు లెక్కల ప్రకారం రేషన్ బియ్యం విడుదల చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. అయితే సెప్టెంబర్ కోటా రేషన్‌ను ఆధార్ లేనివారిని తప్పించి ఇంతకుముందే విడుల చేశారు, మిగిలిన రేషన్ సరుకులను విడుదల చేస్తూ ఈ నెల 15న హడావుడిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నెలకు గాను 2, 3 తేదీల్లో తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కేటగిరీలు కలిపి 7,67,959 కార్డులకు సంబంధించి 25,19,391 లక్షల యూనిట్లు అంటే.. 10,843.708 మెట్రిక్ టన్నుల బియ్యం విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆధార్ లేని వారిని మినహాయించి 94 శాతం యూనిట్లు.. అంటే 9780.036 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే విడుదల చేశారు. సోమవారం నాటి తాజా ఆదేశాలతో అదనంగా 1063.670 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విడుదల చేశారు. దీంతో 99.62 శాతం లబ్ధిదారులకు బియ్యాన్ని విడుదల చేసినట్లైంది. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల అధికారి సీహెచ్. అనందకుమార్ వద్ద ప్రస్తావించగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెలకు పూర్తి రేషన్‌ను విడుదల చేశామని తెలిపారు.