సాక్షి, తిరుపతి: పేద, మధ్యతరగతి వారికి ఇస్తున్న రేషన్ బియ్యం మిల్లర్లకు భోజ్యం గా మారుతోంది. ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజా పంపిణీ (పీడీఎఫ్) బియ్యంలో సుమారు 45 శాతం రీసైక్లింగ్ జరుగుతోంది. రేషన్ డీలర్ల నుంచి పెద్ద మొత్తంలో సేకరించి మిల్లుల్లో సన్నగా పట్టిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అనధికారికంగా గోదాములు ఏర్పాటు చేసుకుని రాత్రికి రాత్రే బ్రాండెడ్ సంచుల్లో నింపుతున్నారు. రిటైల్ మార్కెట్‌లలో విక్రయిస్తున్నారు. జిల్లాలో కార్డు దారుల కోసం ప్రతినెలా 18,708 టన్నుల బియ్యం దిగుమతి అవుతున్నాయి. ఇందులో 7.5 వేల టన్నులకుపైగా బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా సరిహద్దులో అటు తమిళనాడు... ఇటు కర్ణాటక రాష్ట్రాలు ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్న మిల్లర్లతో దళారులు ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది.
25 శాతం మంది బాగోలేవనే కారణంతో రేషన్ బియ్యం తీసుకోవడం లేదు. మరో ఏడుశాతం మంది రేషన్ తీసుకులేకపోతున్నారు. 5 శాతం రేషన్ కార్డులు కొందరు డీలర్ల వద్ద ఉన్నాయి. లబ్ధి్దదా రులు రాకపోయినా బియ్యం తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదవుతున్నాయి. అసలు లబ్ధిదారుడికి కార్డు ఉందనే విషయం తెలియని పరిస్థితి. లబ్ధిదారుల బియ్యం రేషన్ దుకాణదారుల వద్దే ఉండిపోతున్నాయి. మరికొందరు బియ్యం వచ్చిన సమయంలో బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేసి వచ్చేస్తున్నారు. ఆ బియ్యాన్ని కొందరు డీలర్లు మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మరికొందరు లబ్ధిదారులు తెలిసిన వారికి అదే ధరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా 45శాతం బియ్యం మిల్లర్లకు చేరుతున్నాయని అంచనా.
అధిక ధరలకు విక్రయం..
రెండు రూపాయల కిలో బియ్యాన్ని కొందరు డీలర్లు రూ.10 చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని శివారు ప్రాంతంలో అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. తిరుపతి రైల్యే కాలనీ, ఆటోనగర్, అక్కారంపల్లి, పుత్తూరు, నగరి, కుప్పం, పలమనేరు, చిత్తూరు సమీపంలో అనధికారిక గోదా ములు ఉన్నట్లు సమాచారం. నిల్వచేసిన బియ్యాన్ని మిల్లుల్లో పాలిష్ పట్టి సన్నబియ్యంగా మార్చేస్తున్నారు. రాత్రికి రాత్రే బ్రాండెడ్ సంచుల్లో నింపి రిటైల్ మార్కెట్లకు తరలిస్తున్నారు. అక్కడ కిలో రూ.30, రూ.35 చొప్పున విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. మరికొందరు తమిళనాడు, కర్ణాటకతో పాటు నెల్లూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తరలివెళ్తున్న బియ్యాన్ని అధికారులు దాడులు చేసి పట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. తిరుపతిలో ఓ నివాసంలో నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్న సమయంలో రేషన్ బియ్యం బస్తాలు బయటపడినట్లు భోగట్టా. కొన్నిచోట్ల అధికారుల సహకారంతో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment