పట్టపగలే మొరం దోపిడీ..! | Daylight .. Morham robbery! | Sakshi
Sakshi News home page

పట్టపగలే మొరం దోపిడీ..!

Published Sat, Aug 22 2015 2:08 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

పట్టపగలే మొరం దోపిడీ..! - Sakshi

పట్టపగలే మొరం దోపిడీ..!

రైల్వే లైన్ పేరిట దోచుకున్నారు..
* అనుమతులపై  అధికారులు తలోమాట
* రూ.8 కోట్ల మొరం తీశారని హైకోర్టులో ‘పిల్’
* ఎంసీ, జీవీఆర్, ఆర్‌ఎన్‌ఆర్ సంస్థలకు నోటీసులు
* కలెక్టర్, ఇరిగేషన్ ఎస్‌ఈ తదితరులకు కూడా జారీ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా ఆర్మూరు ప్రాంతంలో జరుగుతున్న పనులు వివాదాస్పదంగా మారాయి.

ఆర్మూరు-నిజామాబాద్‌ల మధ్యన సాగుతున్న ఈ రైల్వేలైన్ పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా రాంచంద్రపల్లి సింగసముద్రం, ధర్పల్లి మండలం లోలం చెరువుల నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల మొరం, మట్టి అక్రమంగా తవ్విన వ్యవహారం ఇప్పుడు కోర్టు చెంతకు చేరింది. సుమారు రూ. 8 కోట్ల విలువ చేసే 3.50 లక్షల క్యూబిక్ మీటర్ల మొరం అక్రమంగా తీశారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది.

రైల్వేలైన్ నిర్మాణ పనులు దక్కించుకున్న రేవూరు నారాయణ రెడ్డి అండ్ సన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, జీవీఆర్ కన్‌స్ట్రక్షన్, మిలీనియం కన్‌స్ట్రక్షన్‌ల జాయింట్ వెంచర్ కాంట్రాక్టు సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ, నిజామాబాద్ ఈఈ, నిజామాబాద్ ఆర్‌డీవో సహా 14 మందిని బాధ్యులను చేస్తూ హైకోర్టు తాత్కాలిక గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లు ఇటీవల నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 7న కౌంటర్ దాఖలు చేసేందుకు ఆధారాలతో కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు నీటిపారుదలశాఖను ఆదేశించగా... నిబంధనలకు విరుద్ధంగా చెరువుల నుంచి అక్రమ మొరం తవ్వకాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
 
పథకం ప్రకారం తవ్వకాలు...
పెద్దపల్లి-నిజామాబాద్ బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు-నిజామాబాద్ లైను పనుల కోసం అర్హత కలిగిన కాంట్రాక్టు సంస్థల ద్వారా రూ.43 కోట్లతో పనులు నిర్వహించేందుకు టెండర్లు నిర్వహించారు. వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి నారాయణ రెడ్డి అండ్ సన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, మిలీనియం కన్‌స్ట్రక్షన్స్, జీవీఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థలు జాయింట్ వెంచర్‌గా టెండర్ల ప్రక్రియ ద్వారా రూ. 50 కోట్లకు దక్కించుకున్నాయి.

ఒప్పందంలో ైరె ల్వే లైన్ మట్టికట్టల కోసం మొత్తం 16.15 లక్షల క్యూబిక్ మీటర్ల మొరం అవసరమని అంచనా వేసిన రైల్వేశాఖ.. కాంట్రాక్టర్లు ఆ మొరం కొనుగోలు చేసేందుకు క్యూబిక్ మీటర్‌కు రూ.164.84 చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు సదరు కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి కానీ, పట్టాదారుల నుంచి కానీ కొనుగోలు చేయాల్సి ఉండగా... ఆర్మూరు-నిజామాబాద్ ప్రధానరహదారిని ఆనుకొని ఉన్న మాక్లూరు మండలం రాంచంద్రపల్లిలోని సిం గసముద్రం, ధర్పల్లి మండలం లోలం చెరువులపై క న్నేశాయి.

పథకం ప్రకారం రాంచంద్రపల్లి గ్రామాభివృద్ధి కమిటీ,  సర్పంచ్‌ల ద్వారా అనుమతి ఇవ్వాలంటూ రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు లేఖలు ఇప్పించారు. అప్పటికే కాంట్రాక్టు సంస్థలు చెరువుల్లో మొరం తవ్వకాలు ప్రారంభించాయి. అం తకు ముందే (జూన్ 27న) రాంచంద్రాపూర్ చెరువులో నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ జి.గంగారాం ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో నిర్వహించిన పంచనామా ప్రకారం సింగసముద్రం చెరువులో మొరం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చారు.

ఈ కాపీలను నీటిపారుదలశాఖ ఈఈ, ఆర్మూరు డిప్యూటీ ఈఈ, నిజామాబాద్ ఆర్‌డీవో, మాక్లూరు ఎస్‌ఐ, తహసీల్దార్లకు ఇచ్చినా.. అక్రమ మొరం తవ్వకాలను నియంత్రించలేకపోయా రు. ఈ నివేదికలను పక్కనబెట్టి సింగసముద్రం, లోలం చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా.. ఇష్టారాజ్యంగా సాగిన ఈ తవ్వకాలపై పి. నరేందర్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ‘పిల్’ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
 
నిబంధనల ఉల్లంఘన
అభివృద్ధి పథకం పేరుతో కాంట్రాక్టు సంస్థలు సాగించిన డే లైట్ రాబరీ (పట్టపగలు దోపిడీ) ‘పిల్’తో వెలుగుచూడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సింగసముద్రం, లోలం చెరువుల్లో అనుమతులు పేరిట ఆ చెరువులతో పాటు ఆర్మూరు-నిజామాబాద్ రహదారి పక్కన కనిపించిన చోట మొరం తవ్వకాలను సాగించిన కాట్రాక్టర్లు రూ.8 కోట్ల విలువ చేసే మొరంను వినియోగించినట్లు అంచనా.

చెరువుల్లో నిజంగానే అనుమతి ఇచ్చినా... చెరువు కట్ట 10 మీటర్ల ఎత్తుంటే 100 మీటర్ల దూరంలో స్లూయిస్ (తూములు) ఎత్తుకే మొరం తీయాలి.  చెరువు కట్ట నుంచి 300 మీటర్ల దూరంలో కేవలం 2 మీటర్ల లోతు వరకే తీయాలన్న నిబంధనలను తుంగలో తొక్కి కాంట్రాక్టు సంస్థ నిర్వాహకులు చెరువు కట్టకు సమీపంలో 2 మీటర్ల కంటే అధికంగా మట్టి తవ్వి తరలించారు. మొరం తీసే క్రమంలో ఏ నష్టం జరిగినా వారే బాధ్యులు కాగా, ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్‌టీఎల్)లోనే ఉండాలి.

సింగసముద్రం చెరువులో ఏఈ గంగారాం పర్యవేక్షణలోనే మొరం తవ్వకాలు జరగాలి. కాని ఇవేమీ పట్టని కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా మొరం తీసి చెరువుల రూపురేఖలనే మార్చేశారు. ఇదిలా ఉంటే వరద కాల్వ మొరంను కూడ ప్రభుత్వం క్యూబిక్ మీటర్‌కు రూ.54.50 చొప్పున విక్రయిస్తోంది. సీనరేజ్ చార్జ్ కలిపితే క్యూబిక్ మీటర్‌కు రూ.76.50లు పడుతుంది. ఇదే లెక్కన చిన్ననీటి వనరుల నుంచి మొరం తీసే కాంట్రాక్టు సంస్థల నుంచి ఎందుకు వసూలు చేయకూడదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఇంత జరుగుతున్నా.. అన్ని స్థాయిల్లో అధికారులు కాంట్రాక్టు సంస్థల నిర్వాహకులతో జత కట్టడంతో చెరువులు, గుట్టలు, ప్రభుత్వభూముల్లో నుంచి మట్టి తీస్తూ.. క్యూబిక్ మీటర్‌కు రూ.164.84 చొప్పున కాంట్రాక్టర్లు జేబులో వేసుకుంటున్నారన్న చర్చ బహిరంగంగా సాగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం రంగంలోకి దిగి అక్రమంగా తవ్విన మట్టికి లెక్కలు కడితే... సుమారు రూ.8 కోట్ల మేరకు సర్కారు ఖజానాకు చేరుతాయంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement