రామాయంపేట (మెదక్ జిల్లా) : ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం బాటిళ్ల లోడుతో వెళుతున్న లారీని సోమవారం వేకువజామున రామాయంపేట వద్ద పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మెదక్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముజాహిద్ సిద్దిఖీ, స్థానిక ఎక్సైజ్ సీఐ సలీం తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని తిలక్‌నగర్ డిపో నుంచి 1300ల కాటన్ల (56400ల సీసాలు) మెన్షన్ హౌజ్ మద్యం బాటిళ్లను ఏపి 16 టీవై 2056 నెంబర్ గల లారీలో రామాయంపేట మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా సామర్లకోట బేవరేజెస్ డిపోకు తరలిస్తున్నారు. అదే సమయంలో రూట్ వాచింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానంతో స్థానిక మల్లెచెరువు కట్ట వద్ద లారీని ఆపి డ్రైవర్‌ను ప్రశ్నించారు.
అతని వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశానికిగాను ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వారు వెంటనే సదరు లారీని స్వాధీన పరచుకొని ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ లారీలో సుమారుగా రూ.25 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ఉన్నాయని, ఇందుకుగాను టాక్స్ రూపేణా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఎనిమిది లక్షలను చెల్లించకుండా వెళుతున్నట్లు తేలిందన్నారు. వారి వద్ద మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పర్మిట్లు, వే బిల్లులు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గఫూర్ అలీతోపాటు క్లీనర్ తోంబేను వారు అరెస్ట్ చేశారు. లారీని మెదక్‌లోని ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐలు యాదగిరి, సయ్యద్ సాదత్ తెలిపారు.
56,400ల మద్యం బాటిళ్ల పట్టివేత
Published Mon, Aug 3 2015 4:55 PM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM
Advertisement