రామాయంపేట : సోదాల పేరిట ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం మండలంలోని గిరిజన తండాలో బీభత్సాన్ని సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మండలంలోని ఝాన్సి లింగాపూర్ పంచాయతీ పరిధిలో గల సదాశివనగర్ తండాలో మూడు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తండాకు చెందిన లంబాడి పుణ్య ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాను బలవంతంగా తెరిచి అందులో ఉన్న దుస్తులు, పాసు బుక్కులు చిందర వందర చేశారు.
అనంతరం కమల, రాజు గుడిసెల్లో ఉన్న బీరువా తాళాలు గడ్డపారతో పగులగొట్టి వాటిలో ఉన్న సామగ్రిని చిందరవందర చేశారు. ఈ విషయమై స్థానిక ఎక్సైజ్ సీఐ సలీంను వివరణ కోరగా, నాటుసారా కాస్తున్నార నే అనుమానంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తండాలో దాడులు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా పుణ్య ఇంటిలో 15 లీటర్లు, కమల ఇంట్లో ఐదు, రాజు ఇంట్లో ఐదు లీటర్లతో పాటు బహిరంగ ప్రదేశంలో 20 లీటర్లు మొత్తం 45 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తాళాలు పగులగొట్టిన విషయమై ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరిని ఫోన్‌లో సంప్రదించగా.. నాటుసారా దాచారనే సమాచారంతోనే దాడులు జరిపారన్నారు. అనుమానం వస్తే చట్టప్రకారం తమకు తాళాలు పగులగొట్టే హక్కు ఉందన్నారు.
ఎక్సైజ్ పోలీసుల దాష్టీకం!
Published Fri, Nov 14 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement