- తోటపల్లి ఆర్‌ఆర్ పనులు వేగవంతం...!
- కలెక్టర్ ఎంఎం. నాయక్...
పార్వతీపురం: జిల్లాలో 5 ఇసుక రీచ్‌లు ఇప్పటికే ఆన్‌లైన్ చేశామని, మిగతా 10 రీచ్‌లు ఒకటి రెండు రోజుల్లో ప్రారంభమవుతాయని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక సబ్-కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అన్ని జిల్లాల కంటే ఈ జిల్లాలోనే ఇసుక ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. తోటపల్లి నిర్వాసిత ఆర్ ఆర్ పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే తోటపల్లి కాలువలకు సంబంధించిన భూ సేకరణ సర్వే పనులు చేపట్టామన్నారు. దీనిలో భాగంగా ప్రాజెక్టు పరిధిలో ఉన్న 20 నిర్వాసిత గ్రామాలకు సంబంధించి ఆర్‌అర్ స్థితిగతులపై సర్వే నిర్వహించి, ఇళ్లకోసం స్థల సేకరణ, ఇళ్ల నిర్మాణం, తాగునీరు, శ్మశానం, పాఠశాల తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 20 నిర్వాసిత గ్రామాలలో ఇప్పటికే 10 గ్రామాలు తరలింపునకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
మిగతా 10 గ్రామాలలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అన్ని శాఖల అధికారులతో చర్చించి, త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించామని చెప్పారు. అలాగే సుంకి, బాసంగి, పిన్నింటి రామినాయుడువలస, గదబవలస, నందివానివలస తదితర గ్రామాలకు సంబంధించి స్థలాల సేకరణకు చర్యలు చేపట్టామన్నారు. కాలువలకు సంబంధించి 18 మంది సర్వేయర్లను అదనంగా ఉపయోగించి సర్వే చేస్తున్నామన్నారు.
ఎన్‌సీఎస్ సుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపు సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. తోటపల్లి సమీపంలో ఉన్న వీతమ్ ఇంజినీరింగ్ కళాశాల భవనంలో టూరిజమ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో జేసీ బి.రామారావు, సబ్-కలెక్టర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.