మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: వెనుకబాటుతనాన్ని తరిమికొట్టి, సహజవనరులన్న సిరులగడ్డ పాలమూరును పునర్నించుకుందామని వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం ‘పాలమూరు పునర్నిర్మాణ ఫోరం’ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ విద్యామిష న్ సమావేశ మందిరంలో ‘రేపటి తెలంగాణలో పాలమూరు అభివృద్ధి’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగిన ఈ సమావేశంలో విద్య, వైద్యం, పరిశ్రమలు, ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్యుత్ తదితర అంశాలపై ఆయాశాఖల నిపుణులు ప్రసంగించారు. పాలమూరు పునర్నిర్మాణ ఫోరం గౌరవ అధ్యక్షుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు పునర్నిర్మాణ ఫోరం ఏ రాజకీయ పార్టీకి, సంస్థకో, వ్యక్తికో అనుబంధమైదని కాదన్నారు.
అన్ని వనరులుండి వెనకబాటు తనానికి గురౌతున్న పాలమూరు జిల్లాను పూర్తిగా అభివృద్ధి పరచాలనే దృఢసంకల్పంతో, అన్ని రంగాల నిష్ణాతులైన వ్యక్తుల చేతస్థాపించామని చెప్పారు. తెలంగాణ కోసం 60 ఏళ్లుగా పోరాటం చేశామని, ఇప్పుడు జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాలల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాల వారు ముందుకురావాలన్నారు. ప్రభుత్వ వైద్య, విద్య, సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని హైకోర్టు న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి అన్నారు. జిల్లాలో వైద్యం రంగం నిర్లక్ష్యానికి గురౌతుందని హెల్త్ ఎడ్యుకేటర్ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు.
జిల్లాలో ప్రతి 10వేల మందిలో 152 మాతృమరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా లేదన్నారు. విద్యాశాఖకు సంబంధించిన శంకర్‌రాథోడ్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను పటిష్టపర్చాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 56శాతం మంది మాత్రమే అక్షరాస్యులున్నారని 80శాతానికి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక నీటిపారుదల శాఖ రిటైర్ట్ చీఫ్ ఇంజనీర్ విఠల్‌రావు, ఆర్డీఎస్ ప్రాజెక్టు జల సంఘం అధ్యక్షుడు సీతారాంరెడ్డి, వ్యవసాయశాఖ నిపుణులు ఖాజమునీర్ అహ్మద్ మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 82శాతం మంది వ్యవసాయంపై ఆధారపడుతున్న వారికి కావల్సిన సాగునీరు అందటం లేదని అన్నారు. జిల్లాలో ఆర్థిక సంక్షోభం పెరిగిపోయిందని కరువు వ్యతిరేక పోరాటం సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి అన్నారు.
లిక్కర్‌సేల్స్‌లో జిల్లా మొదటిస్థానంలో ఉందని, ఈ పరిస్థితిని మార్చాలని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి పాలమూరు నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్త బెక్కరి రాజశేఖర్‌రెడ్డి, కో ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎం.ఏ.అలీం, విద్యుచ్చక్తి నిపుణులు కృష్ణారెడ్డి, ఫిషరిస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎం.ఏ. వాజీద్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో పీపీఎఫ్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతిరావు, కోశాధికారి ఎన్.శ్రీహరి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు, యువత పాల్గొన్నారు.