ఆంధ్రాబ్యాంకులో చోరీ యత్నం
Published Tue, Oct 1 2013 1:10 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
పత్తికొండ అర్బన్, న్యూస్‌లైన్: పట్టణంలోని ఆంధ్రాబ్యాంకులో చోరీకి ప్రయత్నించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. బ్యాంకుకు సెక్యురిటీ గార్డు, మెయిన్ అలారం, సీసీ కెమరాలు తదితర ఏర్పాట్లేవీ లేకపోవడంతో దుండగులు తేలిగ్గా స్ట్రాంగ్ రూంలోకి ప్రవేశించి లాకర్ తెరిచేందుకు నానా ప్రయత్నం చేసి ఫలితం లేకపోవడంతో పారిపోయారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు శుక్ర,శనివారాల్లో బంద్ నిర్వహించారు. ఆదివారం సెలవుదినం కావడంతో వరుసగా మూడురోజులు బ్యాంకు మూతపడింది. సోమవారం విధి నిర్వహణలో భాగంగా బ్యాంకుకు వచ్చిన సిబ్బంది స్ట్రాంగ్‌రూం తలుపు పగులగొట్టబడి ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ప్రియతంరెడ్డి సిబ్బందితో వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే సొమ్ము ఏమీ పోలేదని బ్యాంకు మేనేజర్ ఎస్.అన్వర్‌బాషా తెలిపారు.
బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమే కారణం :
బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం కారణంగానే దొంగలు చోరీకి యత్నించినట్లు తెలుస్తోంది. పట్టణంలో ఇటీవలే ఆంధ్రాబ్యాంకు బ్రాంచి ఏర్పాటు చేశారు. దీంతో వేలాదిగా ఖాతాదారులు చేరారు. అదే రీతిలో బ్యాంకు లావాదేవీలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో బ్యాంకు అధికారులు కనీసం సెక్యురిటీని కూడా ఏర్పాటు చేయలేదు. సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు లిఖిత పూర్వకంగా సూచించినా నిర్లక్ష్యం వహించారు. చోరీ జరిగిన విషయాన్ని కూడా ఆలస్యంగా గుర్తించడం బ్యాంకు పట్ల అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది.
Advertisement
Advertisement