♦ ప్రాథమిక స్థాయి ప్రమాణాల్లో 3వ స్థానంలో ప్రకాశం
♦ విద్యాప్రమాణాల పరీక్షలో మెరిసిన విద్యార్థులు
♦ వార్షిక అంచనా సర్వే ఫలితాలు విడుదల
ఒంగోలు వన్‌టౌన్ : ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను అంచనా వేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో సర్వశిక్షా అభయాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక అంచనా సర్వే (యాన్యువల్ అసెస్‌మెంట్ సర్వే) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. 3, 5 తరగతుల్లో రాష్ట్ర స్థాయిలో ప్రకాశం జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. 5వ తరగతి తెలుగులో విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ప్రాథమిక స్థాయిలో 3, 5, 8 తరగతులకు సర్వే నిర్వహించగా ప్రస్తుతం 3, 5 తరగతుల ఫలితాలను మాత్రమే ప్రకటించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల ప్రమాణాలను అంచనా వేసేందుకు గతంలో ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో మాత్రమే సర్వే నిర్వహించేవారు.
అయితే ఈ సర్వే వల్ల విద్యార్థుల్లోని ప్రమాణాలు అంచనా వేయడంలో శాస్త్రీయత లేదని గ్రహించిన ప్రభుత్వం విద్యార్థులందరి ప్రమాణాలను అంచనా వేసేందుకు ప్రత్యేకంగా వార్షిక పరీక్ష నిర్వహించాలని నిర్ణయించి ఆ మేరకు పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని డీఈడీ కళాశాలల్లో చదువుతున్న ఛాత్రోపాధ్యాయుల్ని ఈ పరీక్షల నిర్వహణకు నియమించారు. సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కార్యాలయం నుంచి సరఫరా అయిన ప్రశ్నాపత్రాలతో డీఈడీ కళాశాలల్లోని ఛాత్రోపాధ్యాయులే పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ప్రశ్న పత్రాలను వారే తీసుకుని ఆయా మండల విద్యా వనరుల కేంద్రాల్లో మూల్యాంకనం చేసి ఫలితాలను సర్వశిక్షా అభయాన్ ప్రాజెక్టు కార్యాలయానికి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. రాష్ట్రస్థాయిలో ఈ పరీక్షా ఫలితాలకు సంబంధించి 3, 5 తరగతుల విద్యార్థుల ఫలితాలను సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం ప్రకటించింది.
ఫలితాలు ఇలా..
వార్షిక అంచనా సర్వే-2015ను జిల్లాలోని 56 మండలాల్లో 3,669 పాఠశాలల్లో నిర్వహించారు. ఈ పాఠశాలల్లో 3, 5 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో రాష్ట్రంలో కడప జిల్లా విద్యార్థులు ప్రథమ స్థానం, కృష్ణా జిల్లా విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలవగా, ప్రకాశం జిల్లా విద్యార్థులు మూడవ స్థానం పొందారు.
3వ తరగతిలో మొత్తం 27,590 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో సగటున 75.20 శాతం మార్కులు సాధించారు. తెలుగులో 78.85, ఇంగ్లిష్‌లో 69.87, గణితంలో 75.66 శాతం మార్కులు పొందారు. జిల్లాకు ఏ గ్రేడ్ లభించింది.
5వ తరగతిలో మొత్తం 27,742 మంది పరీక్ష రాశారు. సగటున మొత్తం 75.14 శాతం మార్కులు సాధించారు. తెలుగులో 81.85 శాతం సగటు మార్కులతో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇంగ్లిష్‌లో 68.60 శాతం, గణితం 72.80 శాతం మార్కులు సాధించారు. మొత్తంగా అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చి ప్రకాశం జిల్లాను మూడవ స్థానంలో నిలిపారు.
5వ తరగతి తెలుగులో ‘ప్రకాశం’ ఫస్ట్
Published Fri, Aug 14 2015 4:21 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM
Advertisement
Advertisement