గణపతి బప్పా మోరియా అంటూ భక్తిపారవశ్యంలో మునిగిన ఆ శోభాయాత్రలో ఒక్కసారిగా శోకం అలుముకొంది. నవరాత్రుల పాటు పూజించిన వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ఇద్దరి నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి.
జిల్లా వ్యాప్తంగా వినాయక శోభాయాత్రల్లో పలు అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. విద్యుదాఘాతంతో ముగ్గురు మరణించగా, పాత కక్షలతో ఊరేగింపులో జరిగిన ఘర్షణలో ఒకరు దారుణహత్యకు గురయ్యారు. పలు చోట్ల ఘర్షణలు జరిగాయి.
హుజూరాబాద్, న్యూస్‌లైన్ : గణపతి బప్పా మోరియా అంటూ భక్తిపారవశ్యంలో మునిగిన ఆ శోభాయాత్రలో ఒక్కసారిగా శోకం అలుముకొంది. నవరాత్రుల పాటు పూజించిన వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ఇద్దరి నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. హుజూరాబాద్ పట్టణంలోని మెకానిక్‌ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఊరేగింపు స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి సూపర్‌బజార్ వైపు వెళ్తుండగా రాత్రి 11 గంటలకు దారిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన హైపవర్ వైర్లు వినాయకుడి రథాన్ని తగిలాయి.
రథాన్ని ఆనుకుని ఉన్న జనరేటర్ ఆటోకు విద్యుత్ ప్రభావం తాకడంతో ఆటోను పట్టుకుని ఉన్న పట్టణంలోని మామిండ్లవాడకు చెందిన మహ్మద్ బాబా(28), కొమ్ము ప్రశాంత్(20) అక్కడికక్కడే మరణించగా, కొలుగూరి ప్రవీణ్(25) తీవ్రంగా గాయపడ్డాడు. రథానికి విద్యుత్ తీగలు తగిలిన వెంటనే రథానికి సంబంధించిన జనరేటర్‌ను తరలిస్తున్న ఆటోకు ప్రమాదవశాత్తు విద్యుదాఘతం చెందడంతోనే ఆ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలాన్ని సీఐ నాగేం దర్‌గౌడ్ పరిశీలించారు. సంఘటన స్థలాన్ని మృతుల కుటుంబాలను ఆర్డీవో పద్మాకర్ పరిశీలించారు.
బాబా సౌండ్స్‌తో...
ప్రమాదంలో చనిపోయిన మహ్మద్ బాబా స్థానికంగా బాబా సౌండ్స్‌ను నిర్వహిస్తూ ప్రజల్లో మంచిపేరు పొందాడు. గోదావరిఖనికి చెందిన బాబా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోగా ఆయన మేనమామ ఇక్కడికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం కలిగిన బాబాకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇదే ప్రమాదంలో మరణించిన కొమ్ము ప్రశాంత్‌ది ఆదిలాబాద్ జిల్లా కడెం. కొద్దిరోజులక్రితం తన చిన్నా న అంకూస్ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. ఈ క్రమంలో బాబా సౌండ్ సెంటర్‌లో పనిచేస్తున్న అంకూస్‌తో వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ ఊరేగింపునకు హాజరై ప్రమాదంలో చనిపోవడంతో అతని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల హమాలీవాడ పరిధిలోని 7వ వార్డు విష్ణునగర్ ఏ క్యాబిన్ ఏరియాకు చెందిన చింతకింది రాజు(19) శోభాయూత్రలో విద్యుదాఘాతానికి గురై మృతి చెం దాడు. రామగుండం మండలం కుక్కలగూడూరుకు చెందిన చంద్రయ్య కుటుంబం మంచిర్యాలకు వలస వెళ్లింది. చంద్రయ్య కూలి పనిచేస్తుండగా భార్య లక్ష్మి, కుమారులు రాజు(19), శేఖర్, మహేశ్వరి ఉన్నారు. ఏ క్యాబిన్ ఏరియాలో విష్ణుసాయి గణేశ్ మండలి శోభాయాత్రను బుధవారం సాయంత్రం నిర్వహిస్తుం డగా మూలమలుపు వద్ద విద్యుత్ లైన్ వాహనానికి అడ్డుగా వచ్చింది.
రాజు దానిని కర్ర సహాయంతో తొలగించే క్రమంలో లారీ వెనక భాగంలో ఉన్న ఇనుప పోల్‌కు తగిలి ఒక్కసారిగా మంటలు లేచాయి. దీంతో విద్యుత్ లైన్ తెగి రాజుపై పడింది. విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కుమారుడిని రక్షించే ప్రయత్నంలో తండ్రి చంద్రయ్యకు కూడా షాక్ తగలడంతో వెనకకు పడగా తలకు గాయమైంది. రాజును 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందగా.. చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. రాజు మరణించిన విషయం తల్లిదండ్రులకు రాత్రి వరకు తెలియలేదు. రాజు ఐటీఐ పూర్తి చేసి వైండింగ్ దుకాణంలో పని చేస్తున్నాడు.