ఆమెకు అందలం
బద్వేలు, న్యూస్‌లైన్: భూమి, ఆకాశం తమకేదీ అడ్డుకాదని అన్నింటా సత్తా చాటుతున్న మహిళలకు రాజకీయాల్లోనూ ప్రాతినిథ్యం దక్కుతోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన వీరికి రిజర్వేషన్ల పుణ్యమా అని అవకాశాలు అందివస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సగానికి పైగా సీట్లను దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 791 పంచాయతీలు, 7700 వార్డు స్థానాలు ఉన్నాయి. 50 శాతం రిజర్వేషన్‌తో మహిళలకు 395 పంచాయతీలు, 3350 వార్డులను కేటాయించారు. అంతకంటే ఎక్కువ మంది మహిళలు పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు.
ప్రస్తుతం జిల్లాలో 430 పంచాయతీ స్థానాల పాలనా బాధ్యతలను మహిళలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పలు మేజర్ పంచాయతీల పాలనా బాధ్యతలను కూడా మహిళలు చేపట్టారు. బీటెక్ చదివిన హబీబున్నీసా పోరుమామిళ్ల మేజరు పంచాయతీ సర్పంచ్‌గా రాణిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 559 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2006లో 552 ఉండగా కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో వాటి సంఖ్య 525కు తగ్గింది. 2011 జనాభా ప్రకారం తీసుకోవడంతో వాటి స్థానాల సంఖ్య పెరిగి 559కి చేరింది.
ఇందులో మహిళలకు 293 స్థానాలు కేటాయించారు. ఇవి 50 శాతం కంటే ఎక్కువ స్థానాలు కావడం గమనార్హం. ఇందులో ఎస్టీలకు 09, ఎస్సీలకు 61, బీసీలకు 75, అన్ రిజర్వుడులో 148 స్థానాలలో మహిళలు పోటీ చేయనున్నారు. దీంతో పాటు మరికొన్ని ఎంపీటీసీ స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. దాదాపు 65 శాతం ఎంపీటీసీ స్థానాలను మహిళలు చేజిక్కించుకునే అవకాశం ఉంది. జిల్లాలో 23 మండలాధ్యక్ష పదవులను కూడా అతివలు చేపట్టనున్నారు. వీరు మండలాల్లో మొదటి పౌరులుగా గౌరవం పొందనున్నారు. 50 జెడ్పీటీసీ స్థానాల్లో 25కు పైగా మహిళలకు కేటాయించారు.
మున్సిపాలిటీల్లోనూ...
ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మహిళలు పదవులను అలంకరించనున్నారు. జిల్లాలోని కడప కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పులివెందుల, జమ్మలమడుగు , రాయచోటి చైర్మన్ స్థానాలను మహిళలకు కేటాయించారు. కడప కార్పొరేషన్‌లో 50 వార్డులకు గాను 25 స్థానాలను మహిళలకే కేటాయించారు. బద్వేలు మున్సిపాలిటీలో 26 స్థానాలకు 14 స్థానాలు అతివలకే దక్కనున్నాయి. ప్రొద్దుటూరులో 40కి 20కి పైగా, జమ్మలమడుగులో 20కి 10 స్థానాలు, రాయచోటిలో 31కి 16 స్థానాలు, పులివెందులలో 26కు 13 స్థానాలు, మైదుకూరులో 23కు 12స్థానాలు, ఎర్రగుంట్లలో 20కి 10 స్థానాలను మహిళలకు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 110కి పైగా కౌిన్సిల్ స్థానాలలో జయకేతనం ఎగుర వేసేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు.