పెరుమాళి (తెర్లాం రూరల్): పాఠశాలకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఓ విద్యార్థి మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మండలంలోని జగన్నాధవలస గ్రామానికి చెందిన చౌడవాడ కామేశ్వరరావు(12) పెరుమాళి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం ఇంటి నుంచి సైకిల్‌పై పాఠశాలకు బయలుదేరాడు. పెరుమాళి మెయిన్ రోడ్డు మీదకు వస్తున్న సమయంలో రాజాం నుంచి రామభద్రపురం వైపు వెళుతున్న లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియగానే ఏఎస్‌ఐ అర్జునరావు, హెచ్‌సీ జనార్దన్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. మృతుని తల్లి రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుండెలవిసేలా రోదించిన తల్లి
అమ్మా.. స్కూల్‌కి వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన కొన్ని నిముషాలకే కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ మృతుని తల్లి రామలక్ష్మి సంఘటన స్థలి వద్ద గుండెలవిసేలా విలపించారు. ఆమె రోదించిన తీరు అందరినీ కలచివేసింది. జగన్నాధవలసకు చెందిన చౌడవాడ జనార్ధనరావు, రామలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. మృతుడు కామేశ్వరరావు పెద్దవాడు. చిన్న కుమారుడు దిలీప్ 5వ తరగతి చదువుతున్నాడు. తండ్రి జనార్దనరావు లారీ డ్రైవర్. ప్రస్తుతం గ్రామంలో లేరు. కుమారుని మరణ వార్తను బంధువులు ఫోన్‌లో తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, స్థానికులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలికి తరలివచ్చారు. కామేశ్వరరావు మృతదేహాన్ని చూసి అతని స్నేహితులు, తరగతి ఉపాధ్యాయులు కన్నీరుమున్నీరయ్యారు.
పాఠశాలకు వెళ్లొస్తానని.. కానరాని లోకాలకు
Published Sun, Aug 2 2015 1:41 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement