
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు, వైద్యులు, ప్రజల్లో ఆందోళన మొదలైంది. సాధారణ జ్వరం, ఆయాసంతో చేరుతున్న వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. వారం వ్యవధిలో వ్యాధితో జిల్లాలో ముగ్గురు మరణించడం, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వ్యాధితో కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్, పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు, బ్రాహ్మణకొట్కూరుకు చెందిన ఒకరు, ప్రొద్దుటూరుకు చెందిన మరొకరు మరణించారు.
వేంపెంటకు చెందిన ఒక మహిళతో పాటు కర్నూలు నగరానికి చెందిన ఒక మహిళ, తాజాగా కృష్ణగిరి మండలం చుంచు ఎర్రగుడికి చెందిన ఓ యువకునికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఒకవైపు తీవ్రమైన ఎండలు ఉండే సమయంలో స్వైన్‌ఫ్లూ వైరస్ ఎలా జీవిస్తుందోనని అధికారులు, వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఈ వ్యాధి కారక వైరస్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా విస్తరిస్తుంది. అయితే ప్రస్తు తం ఎండలు వేసవిని తలపిస్తున్నా కేసులు పెరుగుతుండటం అర్థంకావడం లేదు. రోగుల కోసం కర్నూలు వైద్యశాలలో ప్రత్యేకంగా ఐసోలేషన్ విభాగం ఏర్పాటు చేశారు.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..
గర్భిణిలు, ఐదేళ్లలోపు పిల్లలు, 50 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు (ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, రక్తపోటు, కిడ్నీ, షుగర్, నరాల వ్యాధులు, క్యాన్సర్, హెచ్‌ఐవీ/ఎయిడ్స్) స్వైన్‌ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
చికిత్సకు తగ్గని అధిక జ్వరం, కష్టంగా ఊపిరిపీల్చుకోవడం, ఛాతిలో, కడుపులో నొప్పి, వరుస వాంతులు కావడం, హఠాత్తుగా మగత, అయోమయ పరిస్థితి, చిన్నపిల్లల్లో దద్దుర్లతో కూడిన జ్వరం, శరీరం రంగు నీలంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
ప్రత్యేక వైద్యశిబిరాలు..
కర్నూలు, ఆదోని, నంద్యాల, మంత్రాలయం బస్టాండ్, రైల్వేస్టేషన్లలో స్వైన్‌ఫ్లూ వ్యాధి పరిశీలనా కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక కొత్తబస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి కేంద్రంలో ఒక వైద్యుడు, స్టాఫ్‌నర్సు, ఇద్దరు వైద్యసిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ నెల 21వ తేదీ వరకు కేంద్రాలు కొనసాగుతాయని, అవసరమైతే పొడిగిస్తామన్నారు. కర్నూలు డివిజన్‌కు అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సరస్వతి, నంద్యాలకు డాక్టర్ రమణ, ఆదోనికి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శారదలను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. తక్షణ సమాచారం, సహాయం కోసం స్వైన్‌ఫ్లూ సెల్ : 9849902379 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సరస్వతి, డీఐఓ డాక్టర్ వెంకటరమణ, కల్లూరు, గార్గేయపురం వైద్యాధికారులు పాల్గొన్నారు.
వ్యాధి లక్షణాలు..
ఊపిరిపీల్చడం కష్టంగా ఉండటం, దగ్గు, జలుబు, జ్వరం, కీళ్లనొప్పులు, డయేరియా (విరేచనాలు), గొంతునొప్పి, తలనొప్పి, వణుకు, అలసట, వాంతులు మొదలైనవి.
ఎలా వ్యాపిస్తుంది?
గాలి ద్వారా హెచ్1ఎన్1 అనే స్వైన్‌ఫ్లూ వ్యాధి ఇన్‌ఫ్లూయింజా ‘ఏ’ వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి ఫ్లూ వ్యాధివలే ఉండి ఊపిరితిత్తుల అంతర్భాగానికి సోకడం వల్ల ప్రమాదకారిగా మారి ప్రాణాపాయం కలిగిస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల ఒకరి నుంచి మరొకరికి ఇది వ్యాపిస్తుంది.
నివారణ చర్యలు..
వ్యాధి లక్షణాలు ఉన్న వారు జనసమూహంలోకి వెళ్లకూడదు. సాధ్యమైనంత వరకు ఇంటిపట్టునే ఉండాలి.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కు/నోరుకు మోచేతి వంపులో దగ్గాలి/తుమ్మాలి. అడ్డంగా వస్త్రం పెట్టుకోవాలి.
స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులు వాడిన దుస్తులు, తువ్వాళ్లు, జేబురుమాళ్లు మొదలైనవి ఇతరులు వాడకూడదు.
వీరితో కరచాలనాలు, ఆలింగనాలు చేయకపోవడమే మేలు.
జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలి.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు
వైద్యుల సలహా లేకుండా సొంతంగా మందులు వాడరాదు.
తగినంత సమయం నిద్రపోవాలి.
ఎక్కువగా నీళ్లు తాగాలి. పౌష్టికాహారం భుజించాలి.