శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో మండల ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీలు) సంఖ్య పెరిగింది. ఇటీవల చేపట్టిన ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. పునర్విభజన ఇప్పటికే పూర్తి కాగా.. ఇప్పుడు వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ‘న్యూస్‌లైన్’కు అందిన సమాచారం ప్రకారం పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఉన్న స్థానాల్లో రెండు తగ్గగా.. 39 కొత్తగా ఏర్పడ్డాయి. జిల్లాలోని 38 మండలాల్లో ప్రస్తుతం 638 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో పాలకొండ, వంగర మండలాల్లో ఒక్కో స్థానం తగ్గాయి. 11 మండలాలు.. ఆమదాలవలస, బూర్జ, జి.సిగడాం, జలుమూరు, ఎల్.ఎన్.పేట, పలాస, పోలాకి, పొం దూరు, రాజాం, రేగిడి, సరుబుజ్జిలిల్లో ఎంపీటీసీల సంఖ్యలో మార్పులేదు. మిగిలిన 25 మండలాల్లో 39 స్థానాలు పెరిగాయి. వీటిలో ఒక్క శ్రీకాకుళం మండలంలోనే 5 స్థానాలు పెరిగాయి. వాస్తవానికి ఇక్కడ తగ్గుతాయని భావించగా.. అత్యధికంగా పెరగడం విశేషం. మొత్తం మీద జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 638 నుంచి 675 పెరుగుతుంది. ఈ సంఖ్యలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. తాజా స్థానాల ముసాయిదా జాబితా ప్రకటించి, దానిపై రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి ప్రస్తుతం అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత తుది జాబితాను గెజిట్‌లో ప్రకటిస్తారు.