సాక్షి, పర్చూరు(ప్రకాశం): సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్‌ని ప్రకటించడంతో అధికారుల్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ఒకపక్క ప్రధాన పార్టీలు, అభ్యర్థుల ప్రకటన కోసం సర్వే నివేదికలు, వారి బలాబలాలపై పరిశీలన చేస్తుండగా, నామినేషన్ల పర్వం ఈనెల 18 నుంచి మొదలుకానుండటంతో అందుకు అవరమైన ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. వేగంగా పనులు చేయిస్తున్నారు.
పెరిగిన పోలింగ్ కేంద్రాలు
నియోజకవర్గంలోని పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, యద్దనపూడి, మార్టూరు మండలాల్లో ఎన్నికల కోసం 300 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2014లో నియోజకవర్గంలో 272 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే ఈసారి కొత్తగా 28 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 300 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటంతో సులభంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అత్యధికంగా మార్టూరు మండలంలో 72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అత్యల్పంగా యద్దనపూడి మండలంలో 28 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
పర్చూరు నియోజకవర్గంలో..
మార్టూరు మండలం | 72 |
పర్చూరు మండలం | 62 |
యద్దనపూడి మండలం | 28 |
కారంచేడు మండలం | 42 |
చినగంజాం మండలం | 42 |
ఇంకొల్లు మండలం | 54 |
మొత్తం పోలింగ్ కేంద్రాలు | 300 |
మొత్తం ఓటర్లు – 2,19,427
పురుష ఓటర్లు – 1,07,547
స్త్రీ ఓటర్లు – 1,11,870
ఇతరులు – 10
సెక్టార్ ఆఫీసర్ల నియామకం
నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 300 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించడానికి ఎప్పటికప్పుడు పరిశీలించడానికి సెక్టార్ ఆఫీసర్లను నియమించారు. 38 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి మండలంలో సెక్టార్ ఆఫీసర్లు పోలీసులతో పాటు వెళ్లి పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. గతంలో లేని విధంగా ఈసారి ఈసీ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాట్లను చేసింది. వసతులపై దృష్టి పోలింగ్ జరిగే కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బంది పడకుండా అధికారులు విద్యుత్, తాగునీటి వసతి వంటి ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు సైతం ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా ఓటర్ల నమోదుకు సైతం ఆకరి అవకాశంగా కేంద్రాల వద్ద బీఎల్వోలు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. చేర్పుల కార్యక్రమం పూర్తయితే ఇంకా ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment