parchuru constituency
-
పర్చూరు పీఠం ఎవరిదో?
2019 ఎన్నికల్లో పర్చూరు పీఠం అధిష్టించేదెవరు.. జనసేవ ప్రభావం ఎవరికి ఇబ్బంది.. అధికార పార్టీ తన సీటును కాపాడుకునేనా.. జగన్ చరిష్మా, వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలతో దగ్గుబాటి విజయం నల్లేరుపై నడకేనా? అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ సారి కులం కార్డు ప్రభావం ఎంతో అంచనా వేయడం కష్టంగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు బరిలో ఈసారి అత్యధికంగా 15 మంది పోటీపడుతున్నా.. ప్రధాన పోటీ వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే సాగుతోంది. సాక్షి, పర్చూరు (ప్రకాశం): నియోజకవర్గ బరిలో ఈసారి 15 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి అన్ని ప్రధానపార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలిపాయి. దీంతో 2019లో పర్చూరులో బహుముఖ పోటీ ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యనే ఉంది. ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్ని ఓట్లు చీలుస్తారు.. ఏ పార్టీకి వారి వల్ల నష్టం వాటిల్లుతుందనే విశ్లేషణ జోరుగా సాగుతోంది. జనసేనతో మేలు ఎవరికి? 2014 ఎన్నికల్లో కూడా అధికంగా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 రాజకీయపార్టీల అభ్యర్థులు, 8 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో తేలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మధ్యనే ప్రధాన పోరు సాగింది. అయితే అప్పటి ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తెలుగుదేశానికి మద్దతు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొట్టిపాటి భరత్కన్నా, టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు 10775 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపులో జనసేన ప్రభావం అధికంగా కనిపించింది. అయితే ప్రస్తుత 2019 ఎన్నికల్లో జనసేన కూటమిగా ఏర్పడి పర్చూరు సీటును బీఎస్పీకి కేటాయించింది. గతానికి భిన్నంగా ఈ సారి పోటీ పర్చూరు అసెంబ్లీలో ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన కూటమి తరపున బీఎస్పీ పోటీ పడుతున్నాయి. పరాజయం ఎరుగుని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈసారి వైఎస్సార్ సీపీ తరఫున పోటీలో నిలిచారు. గతంలో టీడీపీ విజయానికి ఉతం ఇచ్చిన పవన్ కల్యాణ్ అభిమానుల ఓట్లు ఈసారి బీఎస్పీకి పడనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీకి గడ్డుపరిస్థితి తప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ అసమ్మతి నాయకులు, ప్రభుత్వ వ్యతిరేఖత, దళితుల భూములను నీరు–చెట్టు పేరుతో తవ్వి టీడీపీ నాయకులు కోట్ల రూపాయిలు దోచుకోవడం, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు వంటి పథకాలు తమకు లాభం చేకూరుస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు చెప్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల ప్రభావం స్వల్పంగానే ఉంది. టీడీపీ గెలుపును దెబ్బతీసిన ప్రజారాజ్యం 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన సందు పూర్ణాచంద్రరావు 19056 ఓట్లు పొంది, తేలుగుదేశం పార్టీ గెలుపుపై తీవ్రప్రభావం చూపారు. దాంతో అప్పుడు కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి నరసయ్యపై 2960 ఓట్లమెజారిటీతో విజయం సాధించారు. ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ వరకు పర్వాలేదనిపించారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పరిస్థితి మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆర్భాటాలకు పోకుండా ప్రతి గ్రామానికి వెళుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారని, పాత పరిచయాలతో బంధుత్వం కలిపి చొరవగా వారి వద్దకు వెళుతూ ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్నికలను ఏలూరి ఒంటరిగానే ఎదుర్కొక తప్పడం లేదు. చెప్పుకోదగ్గ ద్వితీయశ్రేణి నాయకుడు ఎవరూ ఆయనకు సాయపడలేకపోతున్నారని ప్రచారాన్ని బట్టి తెలుస్తోంది. దగ్గుబాటికి మాత్రం గొట్టిపాటి భరత్, వెంకటేశ్వరరావు తనయుడు యువకుడైన హితేష్చెంచురామ్లు తోడుగా నిలిచి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ ముగ్గురు మొనగాళ్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
ఉద్దండుల అడ్డా.. పర్చూరు గడ్డ..!
సాక్షి, పర్చూరు (ప్రకాశం): రాజకీయమంటే రసవత్తరమే.. ఎత్తులు, పై ఎత్తులు, ప్రచారాలు ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా ఓట్ల పండగే.. ఇలాంటి వాతావరణం పర్చూరు నియోజకవర్గంలో మెండుగా ఉంటుంది.. ఉద్దండులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి సేవల్లో అగ్రగాములుగా నిలిచారు. మరో వైపు ఈ నియోజకవర్గానికి ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది. దగ్గుబాటి రామానాయుడు ఎన్నికల ప్రస్థానం... ♦ సినీ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రామానాయుడు 1999లో టీడీపీ రాజకీయ ప్రవేశం చేశారు. అనంతరం 1999లో టీడీపీ తరఫున బాపట్ల పార్లమెంట్ నుంచి దగ్గుబాటి రామానాయుడు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్తి జె.డి.శీలం పై 92,457 ఓట్లతో గెలుపొందారు. గాదె వెంకటరెడ్డి ఎన్నికల నేపథ్యం... ♦ 1967 లో పర్చూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాదె వెంకటరెడ్డి, సీపీఎం అభ్యర్థి ఎన్. వెంకటస్వామి పై 10,427 ఓట్లతో గెలుపొందారు. ♦ 1991 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా గాదె వెంకటరెడ్డి, టీడీపీ అభ్యర్థి దామచర్ల ఆంజనేయులపై 14,510 ఓట్లతో గెలుపొందారు. ♦ 1994 లో పర్చూరు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా గాదె వెంకటరెడ్డి, టీడీపీ అభ్యర్థి బత్తుల బ్రహ్మానందరెడ్డి పై 2,202 ఓట్లతో గెలుపొందారు. ♦ 1994లో గాదె వెంకటరెడ్డి ఎక్సైజ్ శాఖామంత్రి గా పనిచేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ నేపథ్యం... టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తెగా, మాజీ మంత్రి వర్యులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్యగా దగ్గుబాటి పురంధేశ్వరికి మంచి గుర్తింపు ఉంది. 2004 సంవత్సరంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిక. ♦ 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల పార్లమెంట్ అభ్యర్థినిగా దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి రామనాయుడు పై 94,082 ఓట్లతో గెలిచారు. ♦ 2006 లో దగ్గుబాటి పురేంధేశ్వరి కేంద్ర మానవవనరుల సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ♦ 2009లో బాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వుడు కావడంతో, విశాఖపట్నం నుంచి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుపై 66,686 ఓట్లతో గెలుపొందారు. ♦ 2009లో దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మానవవనరుల సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ♦ 2014 లో ఆంధ్రప్రదేశ్ అడ్డగోలు విభజనతో కాంగ్రెస్‌తో విభేదించి, రాజీనామా చేసి బీజేపీలో చేరిక. ♦ 2014 లో బీజేపీ తరఫున రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓటమి. ♦ దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా పదవులు నిర్వహించారు. ప్రస్తుతం బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పర్చూరు: జిల్లాలో ప్రముఖులను అసెంబ్లీకి, పార్లమెంట్‌కు పంపిన ఘనత పర్చూరు నియోజకవర్గానికే దక్కుతుంది. జిల్లాలో ముగ్గురు మంత్రులుగా పనిచేసినవారు పర్చూరు నియోజకవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇలా జిల్లాలోని ఏ నియోజకవర్గంలో లేదు. జిల్లాలో మహిళా మంత్రిగా చేసిన పనిచేసిన ఘనత పర్చూరు నియోజకవర్గానికే దక్కుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా పర్చూరు నియోజకవర్గం మళ్లీ 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి రామానాయుడు దగ్గుబాటి పురంధేశ్వరీ ఎంపీలుగా పోటీ చేశారు. జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి... పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా జాగర్లమూడి లక్ష్మీపద్మావతి. ♦ 1999లో టీడీపీ అభ్యర్థిగా జాగర్లమూడి లక్ష్మీపద్మావతి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 2,209 ఓట్లతో గెలుపొందారు. ♦ 1999 లో జాగర్లమూడి లక్ష్మీపద్మావతి వాణిజ్యశాఖ మంత్రిగా పనిచేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రస్థానం... ♦ 1985 లో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి పై 1077 ఓట్లతో గెలుపొందారు. ♦ 1989లో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 6,828 ఓట్లతో గెలుపొందారు. ♦ 2004లో కాంగ్రెస్ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి బాచిన చెంచు గరటయ్యపై 15,546 ఓట్లతో గెలుపొందారు. ♦ 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి నరసింహారావు పై 2,960 ఓట్లతో గెలుపొందారు. ♦ 1991 సంవత్సరంలో టీడీపీ తరఫున బాపట్ల ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి సలగల బెంజిమిన్ పై 1077 ఓట్లతో గెలుపొందారు. ♦ 1996–2002 మధ్య రాజ్యసభ ఎంపీగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు. ♦ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ మంత్రివర్గంలో 11–7–1987 లో మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గా పనిచేశారు. గెలుపొందిన వారు వీరే - ఇప్పటికి 14సార్లు ఎన్నికలు ► 1955లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి కె. రామయ్య, సీపీఐ అభ్యర్థి కె. వెంకయ్యపై 5,501 ఓట్లతో గెలుపొందారు. ► 1962లో సీపీఎం అభ్యర్థి ఎన్. వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం. నారాయణరావుపై 8041 ఓట్లతో గెలుపొందారు. ► 1967లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి, సీపీఎం అభ్యర్థి ఎన్. వెంకటస్వామిపై 10,427 ఓట్లతో గెలుపొందారు. ► 1972లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మద్దుకూరి నారాయణరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 310 ఓట్లతో గెలుపొందారు. ► 1978లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా మద్దుకూరి నారాయణరావు, జనతాపార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 4937 ఓట్లతో గెలుపొందారు. ► 1983లో ఇండిపెండెంట్ అభ్యర్థి దగ్గుబాటి చౌదరి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 6,614 ఓట్లతో గెలుపొందారు. ► 985లో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 1077 ఓట్లతో గెలుపొందారు. ► 989లో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 6,828 ఓట్లతో గెలుపొందారు. ► 1991 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి, టీడీపీ అభ్యర్థి దామచర్ల ఆంజనేయులుపై 14,510 ఓట్లతో గెలుపొందారు. ► 1994లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి, టీడీపీ అభ్యర్థి బత్తుల బ్రహ్మానందరెడ్డిపై 2,202 ఓట్లతో గెలుపొందారు. ► 1999లో టీడీపీ అభ్యర్థి జాగర్లమూడి లక్ష్మీపద్మావతి, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి పై 2,209 ఓట్లతో, 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి బి. చెంచుగరటయ్యపై 15,546 ఓట్లతో, 2009లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. టీడీపీ అభ్యర్థి జి. నరసింహారావుపై 2,960 ఓట్లతో గెలుపొందారు. ► 2014లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు, వైఎస్సార్సీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్‌పై 10,775 ఓట్లతో గెలిచారు. గెలుపొందారు. పర్చూరు పర్చూరు నియోజకవర్గంది జిల్లాలో ఒక ప్రత్యేక ప్రస్థానం. ఇక్కడి ఓటర్లు అన్నిపార్టీలనూ ఆదరించినప్పుటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులే ఎక్కవసార్లు గెలుపొందారు. నియోజకవర్గం 1955లో ఏర్పడగా ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో పర్చూరు, కారంచేడు, చినగంజాం, ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరు మండలాలున్నాయి. ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో తలపడిన కాంగ్రెస్ పార్టీ 7 సార్లు విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక ఎనిమిది సార్లు ఆపార్టీ అభ్యర్థులు బరిలో నిలవగా 4 సార్లే విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులపై రెండుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. 1972లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మద్దుకూరి నారాయణరావు, 1983లో ఇండిపెండెంట్ అభ్యర్థి దగ్గుబాటి చౌదరి విజయం సాధించారు. ఇక్కడి నుంచి సీపీఎం అభ్యర్థి సైతం ఒకసారి 1962లో గెలుపొందారు. ఎక్కువసార్లు కాంగ్రెస్, టీడీపీలు తలపడ్డాయి. ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా తన ఉనికి కోల్పోయింది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీ చేసేందుకు నియోజకవర్గంలో అభ్యర్థి కరువయ్యారు. గత ఎన్నికల్లో ప్రధాన పోరు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరిగింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్య పోరు రసవత్తరంగా మారబోతుంది. -
ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలు
సాక్షి, పర్చూరు(ప్రకాశం): సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్‌ని ప్రకటించడంతో అధికారుల్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ఒకపక్క ప్రధాన పార్టీలు, అభ్యర్థుల ప్రకటన కోసం సర్వే నివేదికలు, వారి బలాబలాలపై పరిశీలన చేస్తుండగా, నామినేషన్ల పర్వం ఈనెల 18 నుంచి మొదలుకానుండటంతో అందుకు అవరమైన ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. వేగంగా పనులు చేయిస్తున్నారు. పెరిగిన పోలింగ్ కేంద్రాలు నియోజకవర్గంలోని పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, యద్దనపూడి, మార్టూరు మండలాల్లో ఎన్నికల కోసం 300 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2014లో నియోజకవర్గంలో 272 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే ఈసారి కొత్తగా 28 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 300 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటంతో సులభంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అత్యధికంగా మార్టూరు మండలంలో 72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అత్యల్పంగా యద్దనపూడి మండలంలో 28 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో.. మార్టూరు మండలం 72 పర్చూరు మండలం 62 యద్దనపూడి మండలం 28 కారంచేడు మండలం 42 చినగంజాం మండలం 42 ఇంకొల్లు మండలం 54 మొత్తం పోలింగ్ కేంద్రాలు 300 మొత్తం ఓటర్లు – 2,19,427 పురుష ఓటర్లు – 1,07,547 స్త్రీ ఓటర్లు – 1,11,870 ఇతరులు – 10 సెక్టార్ ఆఫీసర్ల నియామకం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 300 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించడానికి ఎప్పటికప్పుడు పరిశీలించడానికి సెక్టార్ ఆఫీసర్లను నియమించారు. 38 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి మండలంలో సెక్టార్ ఆఫీసర్లు పోలీసులతో పాటు వెళ్లి పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. గతంలో లేని విధంగా ఈసారి ఈసీ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాట్లను చేసింది. వసతులపై దృష్టి పోలింగ్ జరిగే కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బంది పడకుండా అధికారులు విద్యుత్, తాగునీటి వసతి వంటి ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు సైతం ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా ఓటర్ల నమోదుకు సైతం ఆకరి అవకాశంగా కేంద్రాల వద్ద బీఎల్వోలు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. చేర్పుల కార్యక్రమం పూర్తయితే ఇంకా ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
పర్చూరులో దగ్గుబాటి ఫ్లెక్సీలపై రగడ
పర్చూరు, న్యూస్‌లైన్ : సొంత ఇంటికి స్వాగతం అంటూ మంగళవారం వేకువజామున పర్చూరు నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఫ్లెక్సీపై దగ్గుబాటితో పాటు ఎన్టీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోలుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి టీడీపీలోకి వెళ్తున్నట్లు పుకార్లు వెలువడుతున్న సమయంలోనే .. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గ కేంద్రమైన పర్చూరు బొమ్మలసెంటర్‌లో ఐదు, మార్టూరులో ఆరు ఫ్లెక్సీలు, యద్దనపూడిలో రెండు చోట్ల, యనమదల గ్రామంలో ఒకచోట దగ్గుబాటి, చంద్రబాబు ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా, ఫ్లెక్సీలన్నిటినీ టీడీపీ కార్యకర్తలు తొలగించారు. మార్టూరులో రాజుపాలెం అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని డేగర్లమూడి గ్రామంలో కాల్చివేశారు. ఫ్లెక్సీల ఏర్పాటు, తొలగింపుపై టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పరసర్పం ఆరోపణలకు దిగారు. ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో టీడీపీ బలపడటాన్ని ఓర్వలేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలను అయోమయానికి గురిచేయడానికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రకటన ఇచ్చిన వారిలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రావి రమణయ్యచౌదరి, జిల్లా కార్యదర్శి కొల్లా సుభాష్‌బాబు, పట్టణ అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణారావు తదితరులున్నారు. అమానుషమైన చర్య... ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని ఇలా తొలగించడం అమానుషమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, దగ్గుబాటి అభిమానులు పేర్కొన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీల తొలగింపుపై మాట్లాడారు. తమ నాయకుని ఫొటో ఉన్న ఫ్లెక్సీని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఫ్లెక్సీలు తొలగించిన తీరు చూస్తుంటే ఏర్పాటు చేసిన వారే తొలగించారనే సందేహం కలుగుతోందన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పోలూరి శివారెడ్డి, మాజీ ఎంపీపీ కోట హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కారుమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీ తొలగింపుపై కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.