పర్చూరులో దగ్గుబాటి ఫ్లెక్సీలపై రగడ | fights on daggubati flexi in parchur | Sakshi
Sakshi News home page

పర్చూరులో దగ్గుబాటి ఫ్లెక్సీలపై రగడ

Published Wed, Jan 29 2014 4:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM

fights on daggubati flexi in parchur

పర్చూరు, న్యూస్‌లైన్ :  సొంత ఇంటికి స్వాగతం అంటూ మంగళవారం వేకువజామున పర్చూరు నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఫ్లెక్సీపై దగ్గుబాటితో పాటు ఎన్టీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోలుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి టీడీపీలోకి వెళ్తున్నట్లు పుకార్లు వెలువడుతున్న సమయంలోనే .. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నియోజకవర్గ కేంద్రమైన పర్చూరు బొమ్మలసెంటర్‌లో ఐదు, మార్టూరులో ఆరు ఫ్లెక్సీలు, యద్దనపూడిలో రెండు చోట్ల, యనమదల గ్రామంలో ఒకచోట దగ్గుబాటి, చంద్రబాబు ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా, ఫ్లెక్సీలన్నిటినీ టీడీపీ కార్యకర్తలు తొలగించారు. మార్టూరులో రాజుపాలెం అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని డేగర్లమూడి గ్రామంలో కాల్చివేశారు. ఫ్లెక్సీల ఏర్పాటు, తొలగింపుపై టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పరసర్పం ఆరోపణలకు దిగారు.
 ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో టీడీపీ బలపడటాన్ని ఓర్వలేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

టీడీపీ కార్యకర్తలను అయోమయానికి గురిచేయడానికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రకటన ఇచ్చిన వారిలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రావి రమణయ్యచౌదరి, జిల్లా కార్యదర్శి కొల్లా సుభాష్‌బాబు, పట్టణ అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణారావు తదితరులున్నారు.

 అమానుషమైన చర్య...
 ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని ఇలా తొలగించడం అమానుషమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, దగ్గుబాటి అభిమానులు పేర్కొన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీల తొలగింపుపై మాట్లాడారు. తమ నాయకుని ఫొటో ఉన్న ఫ్లెక్సీని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

 ఫ్లెక్సీలు తొలగించిన తీరు చూస్తుంటే ఏర్పాటు చేసిన వారే తొలగించారనే సందేహం కలుగుతోందన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పోలూరి శివారెడ్డి, మాజీ ఎంపీపీ కోట హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కారుమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీ తొలగింపుపై కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement