రాష్ట్రానికి ప్రత్యేక హోదా కష్టమే..
- ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడవద్దని టీడీపీకి చెప్పా
- విజయవాడలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు
- కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి కేటాయింపులు కష్టం
సాక్షి, విజయవాడ బ్యూరో/మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పరోక్షంగా తేల్చి చెప్పారు. శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడలోని ఒక హోటల్‌లో జరిగిన ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో నాకు తెలుసు. కానీ కేంద్రంలోనూ అనేక ఆర్థిక సవాళ్లున్నాయి.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అనేక రకాల ఇబ్బందులున్నాయి. అందుకే బిల్లు పెట్టేటప్పుడు వీటిన్నింటినీ ప్రణాళికా సంఘం సమావేశంలో పెట్టి ఆ తర్వాత పార్లమెంటుకు తీసుకురావాలని యూపీఏ ప్రభుత్వానికి చెప్పా. వారు వినలేదు. ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడవద్దని టీడీపీ వారికి కూడా చెప్పాను’’ అని తెలిపారు. కేంద్రంలో కూడా ఆర్థిక సవాళ్లు ఉన్నాయని, కేంద్ర బడ్జెట్‌లో నుంచి ఏపీకి డబ్బు ఇవ్వడం కష్టమని స్పష్టం చేశారు.
కొత్త రాజధానిలో రాజ్‌భవన్‌తో పాటు సచివాలయం, శాసనసభ, డ్రెయినేజీ, తాగునీటి సరఫరా, రింగురోడ్లు, మెట్రో రైలు ప్రాజెక్టు వంటి వాటికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి ఆయా మంత్రిత్వ శాఖలకు పంపితే.. ఆయా కేంద్ర విభాగాల ద్వారా బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తారని ఏపీకి ఇచ్చే సాయంపై స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి రాయితీలు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నామన్నారు.భూసేకరణ సమస్య వల్ల పరిశ్రమల స్థాపన ఆగిపోయిందని అందుకే ఆ చట్టంలో మార్పులు చేశామని చెప్పారు. కమ్యూనిజం వైఫల్యమైందనేందుకు రష్యా, చైనాలే ఉదాహరణలన్నారు.
మిస్టరీగా మహనీయుల మరణాలు..
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కొంతమంది మహనీయులు అనుమానాస్పద స్థితిలో మరణించారని వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణానదీ తీరంలో నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఇచ్చిన స్థలంలో డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ట్రస్టు భవనానికి వెంకయ్య భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. స్వాతంత్య్రోదమంలో పోరాడిన సుభాష్ చంద్రబోస్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి వంటివారి మరణాలు మిస్టరీగా మారాయన్నారు. అనంతరం కృష్ణాజిల్లా ఆత్కూరు గ్రామంలో స్వర్ణభారత్ ట్రస్టు విజయవాడ చాప్టర్ భవన నిర్మాణానికి వెంకయ్యనాయుడు భూమి పూజ చేశారు. భవిష్యత్తులో తెలంగాణ , హైదరాబాద్‌లోనూ ట్రస్టు శాఖలను ప్రారంభిస్తామని చెప్పారు.
అంతర్జాతీయ మెడికల్ హబ్‌గా ఏపీ
అంతర్జాతీయ పర్యాటక మెడికల్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరముందని వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల పదో వార్షికోత్సవం, అంతర్జాతీయ పీఎంఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య, వైద్యం అందించేందుకు నేటి యువత పరిశోధనారంగంపై దృష్టి సారించాలన్నారు.
రాజధాని రైతులకు అవమానం
శ్యామ్ ముఖర్జీ ట్రస్టు భూమి పూజ సమయంలో రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి రైతులకు అవమానం జరిగింది. వెంకయ్యనాయుడిని కలవడానికి వచ్చిన సుమారు 50 మంది రైతులను ఆ కార్యక్రమం ప్రారంభానికి ముందు తాడేపల్లి సీఐ సీహెచ్ కోటేశ్వరరావు అక్కడ నుంచి బలవంతంగా పంపించివేశారు. వెళ్లకపోతే రౌడీషీట్లు తెరుస్తామని రైతులను హెచ్చరించారు. దీంతో భయపడ్డ రైతులు సభాస్థలిని వదిలి వెళ్లిపోయారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తాము కేంద్ర మంత్రిని కలసి తమకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించేందుకు వచ్చామని, గొడవ చేయడానికి కాదని వివరించారు. తాము విజ్ఞాపన పత్రం అందజేయాలని భావిస్తే సీఐ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తుళ్లూరు ప్రాంతంలో ఏడాదికి మూడు పంటలు పండే జరీబు భూములకు అదనంగా ప్యాకేజీ పెంచాలని ఆ గ్రామానికి చెందిన బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిశోర్, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని సత్యనారాయణ, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తొండపు రామశివగుప్తా, ఇతర రైతులు కేంద్ర మంత్రి వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు.