కర్నూలు: రాష్ర్ట ప్రభుత్వం ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలు సీమ ముఖద్వారంలో నిర్వహించాలని తలపెట్టడంతో రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ జాస్తి వెంకట్రాముడు బుధవారం కర్నూలుకు వచ్చారు. ఇంటలిజెన్స్ అడిషినల్ డీజీపీ అనురాధ, ఏపీఎస్పీ బెటాలియన్స్ అడిషినల్ డీజీపీ గౌతమ్ సవాంగ్, రాయలసీమ ఇన్‌చార్జి ఐజీ వివి.గోపాలక్రిష్ణ తదితరులతో కలిసి ఏపీఎస్పీ రెండో పటాలాన్ని పరిశీలించారు. పటాలంలోని మైదానమంతా కలియదిరిగి ఏర్పాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించినందున ఏర్పాట్లకోసం నిధులు ఎంత అవసరమవుతాయో అంచనాలు సిద్ధం చేసి పంపాలని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు. మునిసిపల్, రోడ్ల భవనాలు, ఎలక్ట్రికల్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో స్వాతంత్య్ర వేడుకలను విజయవంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. సభావేదిక, జాతీయ జెండా ఆవిష్కరణకు సంబంధించిన దిమ్మె ఏర్పాట్లు ఎలా ఉండాలనే దానిపై అధికారులతో చర్చించారు.
స్వాతంత్య్ర వేడుకలకు బెటాలియన్‌లో ట్రైనింగ్ సెంటర్ మైదానాన్ని ఎంపిక చేశారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆమోదానికి పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శకటాల ప్రవేశం, పెరేడ్ నిర్వహణ, హెలిపాడ్ నిర్మాణం తదితర వివరాలను ఏపీఎస్పీ డీఐజీ ప్రసాద్‌బాబు వివరించారు. అనంతరం జిల్లా యంత్రాంగం రూపొందించి న రూట్ మ్యాప్‌ను పరిశీలించారు.
వీఐపీల గ్యాలరీ, వీక్షకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే షామియానాలు తదితర వాటిని కూడా ఎక్కడెక్కడ ఉండాలనే విషయంపై క్షుణ్ణంగా పరిశీలించారు. పటాలానికి రెండు వైపులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయాలని, ఒకవైపు ముఖ్యమంత్రి కాన్వాయ్, మరో వైపు వీఐపీల ప్రవేశం ఉండే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. రక్షణ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీఐపీలు, వీవీఐపీల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై కూడా ఇంటలిజెన్స్ అధికారులతో చర్చించారు.
డీజీపీ పర్యటన సాగిందిలా...
డీజీపీ హైదరాబాద్ నుంచి సాయంత్రం 4.30 గంటలకు కర్నూలుకు చేరుకున్నారు. 6.30 గంటల వరకు ఏపీఎస్పీ మైదానంలోనే గడిపారు. హైదరాబాద్ నుంచి బాంబ్ డిస్పోజల్ టీమ్ డీఎస్పీ భద్రయ్య నాయకత్వంలో కర్నూలుకు చేరుకుంది. వారితో కూడా భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు. స్వాతంత్య్ర ఉత్సవాల్లో పాల్గొనేందుకు సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని బెటాలియన్స్‌కు సంబంధించిన సాయుధ బలగాలు జిల్లాకు వస్తున్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా చర్చించారు.
బెటాలియన్ కమాండెంట్ విజ య్‌కుమార్ కార్యాలయంలో కూడా అరగంట పాటు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కర్నూలు డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ రఘురామిరెడ్డి, ఎస్‌ఐబీ డీఐజీ పీవిఎస్.రామక్రిష్ణ, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ వివిఎస్.మూర్తి, అనంతపురం డీఐజీ బాలకృష్ణ, నంద్యాల ఏఎస్పీ సుప్రత్ సింగ్, కర్నూలు డీఎస్పీ మనోహర్‌రావు, హోంగార్డ్స్ డీఎస్పీ కృష్ణమోహన్ సమావేశంలో పాల్గొన్నారు.
కర్నూలులో పోలీస్‌బాస్
Published Thu, Jul 10 2014 1:58 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement