
సాక్షి, విజయనగరం: సాంస్కృతిక నగరంగా వెలుగొందుతున్న విజయనగరం అంతర్జాతీయ క్రికెట్ క్రీడకు ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు విశాఖలోని ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్– సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందుగా ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్‌లో ఆడేందుకు సఫారీల జట్టు విజయనగరం రానుంది. జిల్లాలోని డెంకాడ మండలం చింతలవలసలో డాక్టర్ పివిజి.రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో మూడు రోజుల పాటు జరిగే ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్‌లో సఫారీల జట్టు బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో తలపడనుంది. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు రోజుల ఆటను ఆస్వాదిద్దాం..
జిల్లా వేదికగా మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయి పురుషుల క్రికెట్ క్రీడాకారులు మూడు రోజుల పాటు తమ ఆటతో కనువిందు చేయనున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌తో పాటు నార్త్‌జోన్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భధ్రతా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ఎస్పీ రాజకుమారిలతో ఈ అంశాలపై ఇప్పటికే చర్చించారు. మూడు రోజుల పాటు జరిగే మ్యాచ్‌లను చూసేందుకు ఒక్కో రోజు 1500 మంది వరకు ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఏసీఏ నిర్వాహకులు వివిధ పాఠశాలల్లో చదువుతున్న 200 మంది విద్యార్థులను ఒక్కో రోజుమ్యాచ్ చూసేలా అవకాశం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టులో ఆడనున్న రోహిత్‌శర్మ
భారత్ – సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌కు ముందు జిల్లాలో జరుగుతున్న ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్‌లో బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టులో ఆడనున్న రోహిత్‌శర్మ ఆడనున్నారు. ప్రస్తుత భారత జట్టు ఫెవరేట్‌గా క్రీడాకారుల మన్ననలు అందుకుంటున్న రోహిత్‌శర్మ లాంటి క్రీడాకారులు జిల్లాకు రానుండటంతో పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియంకు వచ్చే అవకాశం ఉంది.
బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు: రోహిత్‌శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, ఎఆర్.ఈశ్వరన్, కరుణ్‌నాయర్, సిద్దేష్‌లడ్, కెఎస్.భరత్(వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, ధర్మేందర్‌షింగ్ జడేజా, అవేష్‌ఖాన్, ఇషాన్‌పోరల్, షార్ధూల్‌థాకూర్, ఉమేష్‌యాదవ్.
సౌత్ ఆఫ్రికా జట్టు: డుప్లిసిస్(కెప్టెన్), టి.బవుమ (వికెట్ కీపర్), కె.రబడ, డికాక్, ఎల్గర్, ఫిలాండర్, మహరాజ్, పీయిడెట్, హంజా, నిగ్ధి, మక్రమ్, డిబ్రూన్, క్లాసెన్, నార్ట్‌జ్, ముతుసమి.
ఏర్పాట్లు చేస్తున్నాం...
భారత్– సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందుగా విజయనగరంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. క్యూరేటర్‌తో ప్రత్యేక పిచ్‌ను తయారు చేయిస్తున్నాం. అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు రానుండటంతో అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. మూడు రోజుల పాటే జరిగే మ్యాచ్‌ను వీక్షించేందుకు రోజుకు 1700 మంది వరకు అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నాం.
– ఎం.వాసుదేవరాజు, కార్యదర్శి, జిల్లా క్రికెట్ అసోసియేషన్

విజయనగరం రానున్న సౌతాఫ్రికా జట్టు (అంచనా)
Comments
Please login to add a commentAdd a comment