పరిగిలోని ఇండియన్ డిజైన్ గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్వాహకులు సమీపంలోని జయమంగళి నది నుంచి ఫ్యాక్టరీలో భవనాల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు...
పరిగి : పరిగిలోని ఇండియన్ డిజైన్ గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్వాహకులు సమీపంలోని జయమంగళి నది నుంచి ఫ్యాక్టరీలో భవనాల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలింపులపై మండల రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఫ్యాక్టరీలో ఇసుక అక్రమ నిల్వలపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించింది. స్పందించిన తహశీల్దార్ గోపాలకృష్ణ రెవెన్యూ సిబ్బంది సహాయంతో ఫ్యాక్టరీలోకి మంగళవారం వెళ్లి భారీ ఇసుక నిల్వలను గుర్తించారు. సుమారు70-80 ట్రాక్టర్ల పరిమాణంలో ఇసుక నిల్వలను గుర్తించిన తహశీల్దార్ ఫ్యాక్టరీ సిబ్బందిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు.
ఫ్యాక్టరీ ఇన్‌చార్జి సందీప్‌తో మాట్లాడిన తహశీల్దార్ ఎవరి అనుమతితో ఈ ఇసుకను తరలించారని ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రుసుం చెల్లించకుండా వందలాది ట్రాక్టర్ల ఇసుకను తరలించేందుకు మీకెంత ధైర్యమని నిలదీశారు. ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న ఇసుకను సీజ్ చేస్తున్నామని, ఈ ఇసుకను కట్టడాలకు వాడితే అదనంగా మరో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఫ్యా క్టరీ నుంచి జయమంగళి నదిలోని ఫ్యాక్టరీ వారు ఏర్పాటు చేసుకున్న అడ్డదారిని తహశీల్దార్ పరిశీలించారు. అనంతరం జయమంగళి నదిలోకి వెళ్లి ఎంత పరిమాణంలో ఇసుక తరలించారనే విషయాలను గుర్తించారు.
అ నంతరం ఫ్యాక్టరీలో ఇసుక డంపులను గుర్తించిన విషయాన్ని తహశీల్దార్ గోపాలకృష్ణ ఆర్డీవో రామ్మూర్తికి తెలిపారు. తహశీల్దార్ వెంట ఆర్‌ఐ సుబ్బారావు, వీఆర్‌వో రఘు, సిబ్బంది ఉన్నారు. అక్రమ ఇసుక తరలింపుపై ‘సాక్షి’ కథనం వెలువడిన వెంటనే ఫ్యాక్టరీలోని భారీ ఇసుక నిల్వలను వేరే ప్రదేశాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించడం గమనార్హం.