పాటలే కాదు..నటనలోనూ మేటే!
* ఇండియన్ ఐడెల్ శ్రీరామచంద్రమూర్తి
అద్దంకి: శ్రీరామ చంద్ర పేరు వినగానే సంగీతాభిమానులు గర్వపడతారు. ఇండియన్ ఐడెల్ -2010 విజేతగా చరిత్ర సృష్టించిన ఆయన అద్దంకికి చెందినవారని తెలిసిందే. స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో శుక్రవారం విలేకర్లతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. ‘అద్దంకి రాగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నాటి ఆటలు, స్నేహితులను ఎప్పటికీ మరచిపోలేను. పాటలతో పాటు నటనలోనూ గుర్తింపు పొందడం నా అదృష్టమే.
జగద్గురు ఆదిశంకరాచార్య, ప్రేమ గీమా జంతానైలో నటించా. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పాటలను వదలకుండా, ఆల్బమ్స్ చేస్తున్నందు వల్ల సన్‌ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అవకాశం వచ్చినా చేయలేదు. ఇప్పటికి 75 సినిమాల్లో ఆరు భాషల్లో 150పైగా పాటలు పాడా. మరిన్ని సినిమాల్లో నటించాలని ఉంది.
అద్దంకిలో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నా. నందమూరి కళాపరిషత్ పిలుపుతో అద్దంకి రావడం నాకు అనందాన్నిస్తోంది’ అని తెలిపారు. మన్నం త్రిమూర్తులు, రాయసం హనుమంతరావు, కోవి శ్రీనివాసరావు, శ్రీరామచంద్ర తండ్రి మంగమూరి రామకోటయ్య పాల్గొన్నారు.