బతికి బయటపడ్డాం | Indian workers return from strife-torn Iraq | Sakshi
Sakshi News home page

బతికి బయటపడ్డాం

Published Fri, Jul 11 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

బతికి బయటపడ్డాం

బతికి బయటపడ్డాం

తణుకు : ఇరాక్‌లో అంతర్యుద్ధం వల్ల భారతీయులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. దీంతో వీరి కుటుంబీకులు వారి క్షేమ సమాచారాలు తెలియక ఎంతో మనోవేదనకు గురయ్యారు. ఎట్టకేలకు భారత రాయబార కార్యాలయ అధికారుల జోక్యంతో ఇరాక్‌కు వలస వెళ్లిన 40 మంది జిల్లాకు చెందిన యువకుల్లో కొందరు గురువారం తణుకు చేరుకున్నారు. అక్కడ తాము పడిన బాధలను తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బులు పోవటంతో పాటు నానాహింసలు భరించాల్సి వచ్చిందని వాపోయారు.  

వీరవాసరం, ఇరగవరం, పాలకొల్లు, పెనుమంట్ర, పెనుగొండ, తణుకు మండలాలకు చెందిన యువకులు గురువారం తణుకులోని మునిసిపల్ కార్యాలయానికి వచ్చి పెంటపాటి పుల్లారావు ప్రతినిధి కాకిలేటి హరినాథ్ ద్వారా మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను కలిసి తమ గోడు వినిపించారు. అప్పులు చేసి లక్షల రూపాయిలు వెచ్చించి ఉపాధికోసం ఇరాక్ వెళ్లామని, తమతో నెలల తరబడి పనిచేయించుకుని జీతం సక్రమంగా చెల్లించకపోవడంతో శ్రమదోపిడీకి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.

జీతాల బకాయిలు ఇప్పించాలని, విజిటింగ్ వీసాపై పంపించి మోసం చేసిన ఏజెన్సీలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేస్తానని చెప్పారు. సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు, ఇండియన్ అంబసీ తరుఫున ఇరాక్ వెళ్లిన ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి  తమను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేయడంపై వారికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. వీరి చొరవతోనే తాము ఇళ్లకు సజీవంగా రాగలిగామని ఆవేదనగా చెప్పారు. ఇరాక్ నుంచి సొంతగడ్డ చేరుకున్న బాధితులు ఆవేదన వారి మాటల్లోనే...
 
ఇరాక్ వెళ్లిన వెంటనే బందీనయ్యా
ఉపాధి కోసం ఇరాక్‌కు వెళ్లా. అక్కడ గొడవలు జరుగుతుండడంతో మమ్మల్ని ఒక గదిలో బంధించి తాళం వేశారు. తాళం పగులకొట్టి వేరే వాళ్ల వద్ద ఉన్న ల్యాప్‌ట్యాప్ ద్వారా ఇక్కడకు సమాచారం అందించాం. భారతీయ రాయబార కార్యాలయం ద్వారా మమ్మలందర్నీ విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. అక్కడ ఏపీ భవన్‌కి పుల్లారావు మాకు ధైర్యం చెప్పి ఇంటికి పంపించారు.  
 - పోతిరెడ్డి గోపాలకృష్ణ, ఐతంపూడి, ఇరగవరం మండలం
 
జీతం అడిగితే కొట్టారు
 నేను కార్పెంటర్ కార్మికుడిని. మార్చి 11న ఉపాధి కోసం ఇరాక్ వెళ్లాను. రూ.1.50 లక్షలు ఖర్చయ్యాయి. నాలుగు నెలలు పనిచే శా. ఒక నెల మాత్రమే జీతం ఇచ్చారు. మూడు నెలల జీతం ఇవ్వాలని అడిగితే కొట్టారు. తనను ఇరాక్ పంపిన బొంబాయికి చెందిన సాధన్ ఆఫీసుకు ఫోన్ చేస్తుంటే అసలు మాట్లాడటం లేదు.
 - అతికినిశెట్టి సత్యనారాయణ, గవర్లపాలెం, ఇరగవరం మండలం
 
తిండి పెట్టకుండా బంధించారు
 ఆరునెలల క్రితం ఇరాక్‌లోని ఆల్‌మన్‌హాల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో హెల్పర్ పనికి వెళ్లాను. రూ.1.20
 లక్షలు ఖర్చయింది. జీతం నెలకి రూ.25వేలు. అయితే రెండు నెలలకు రూ.36 వేలే ఇచ్చారు. నాలుగు నెలల జీతం ఇవ్వలేదు. పనికి వెళ్లద్దని రూమ్‌లో బంధించారు. పాస్‌పోర్ట్ సైతం కంపెనీయే తీసేసుకుంది. మిగిలిన జీతం అడిగితే కొట్టేవారు.
 -  కారింకి దుర్గాప్రసాద్, దిగమర్రు, పాలకొల్లు మండలం
 
ఎన్నో ఇబ్బందులు పడ్డాం
 ఆరునెలల క్రితం దువ్వ నుంచి 14 మంది ఇరాక్ వెళ్లాం. అక్కడ కనీస వసతులు లేవు. భోజనం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. నెలజీతంగా రూ.17 వేలే ఇచ్చారు. మిగిలిన జీతం ఇవ్వలేదు. గొడవల కారణంగా అక్కడ బంధించడంతో ఎలాగోలా ఇక్కడకు సమాచారం అందించాం. దీంతో ఇంటికి రప్పించేందుకు ఎమ్మెల్యే కృషి చేశారు.
 - కోలా నర్సింహరాజు, దువ్వ, తణుకు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement