స్వదేశానికి మరో 200 మంది
* ఇరాక్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి..
* రెండు రోజుల్లో మరో 2,200 మంది
న్యూఢిల్లీ: అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఇరాక్ నుంచి మరో 201 మంది భారతీయులు ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. భారత విదేశాంగ శాఖ వీరిని నజాఫ్ నుంచి ఇరాకీ ఎయిర్‌వేస్‌కు చెందిన ప్రత్యేక విమానంలో వేకువజామున ఢిల్లీకి తీసుకొచ్చింది. ఎయిరిండియా, ఇతర విమాన సంస్థల ప్రత్యేక విమానాల ద్వారా వచ్చే రెండు రోజుల్లో మరింత మంది భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఆదివారం తెలిపారు.
ఘర్షణలు లేని దక్షిణ ఇరాక్‌లో ఉన్న దాదాపు 2,200 మంది భారతీయులు అక్కడి నుంచి వస్తామని చెప్పారని, రెండు రోజుల్లో వీరినీ భారత్‌కు తీసుకొస్తామన్నారు. వీరిలో 600 మందికి వారి యాజమాన్య కంపెనీలు టికెట్లు ఇచ్చాయని, మిగతా 1600 మందికి భారత ప్రభుత్వం టికెట్లు ఇస్తోందని తెలిపారు. ‘వచ్చే 48 గంటల్లో నజాఫ్ నుంచి 200 మందిని, బస్రా నుంచి 280 మందిని ప్రత్యేక విమానాలు ఢిల్లీకి తీసుకొస్తాయి. నజాఫ్ నుంచి మరో వాణిజ్య విమానంలో 117 మంది సోమవారం ఢిల్లీ చేరుకుంటారు. బాగ్దాద్‌లోని భారత ఎంబసీ.. హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ముంబైలకు చెందిన 600 మందికి ఇదివరకే టికెట్లు సమకూర్చింది. వీరిలో చాలా మంది స్వస్థలాలకు చేరుకున్నారు. నజాఫ్, కర్బలా, బస్రా, బాగ్దాద్‌లలో నాలుగు సంచార బృందాలు స్వదేశానికి రావాలనుకునే భారతీయుల వివరాలు సేకరిస్తున్నాయి’ అని తెలిపారు.
నావి తప్పులైతే సలహాలివ్వండి: ఐఎస్‌ఐఎస్ నేత బకర్
బాగ్దాద్: ఇరాక్ మిలిటెంట్లు ఇస్లామిక్ రాజ్యాధినేత(ఖలీఫా)గా ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) నేత అబూ బకర్ అల్ బగ్దాదీ తొలిసారిగా ఓ వీడియోలో కనిపించారు. ఆయన మోసుల్ లో శుక్రవారం ఓ మసీదులో ప్రసంగిస్తున్నట్లున్న ఈ వీడియోను మిలిటెంట్లు ఆన్‌లైన్‌లో ఉంచారు. ‘మీలో నేను సమర్థుడిని కాకపోయినా నేనే మీ నాయకుడిని. నేను సరైన దారిలో వెళ్తుంటే మద్దతివ్వండి. నావి తప్పులైతే సలహాలివ్వండి’ అని బకర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.