
రద్దు యోచనలో.. 8.81 లక్షల ఇందిరమ్మ ఇళ్లు!
పునాదులు కూడా పడని ఇళ్లను రద్దు చేయాలని యోచన
నిర్మాణాల్లో ఉన్న ఇళ్లకు ఆధార్ లింకు పేరుతో కొత్త మెలిక
హైదరాబాద్: ఇళ్లు మంజూరైనా ఇప్పటికీ పునాదులు తీసుకోని ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పునాదులు కూడా పడని 8.81 లక్షల ఇళ్లను గుర్తించి వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వాటి బిల్లులను గత 8 నెలలుగా ప్రభుత్వం నిలిపివేసింది. ఈ బిల్లుల కోసం 5.50 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. వీరికి రూ. 450 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. 2014-15 బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు ప్రభుత్వం రూ. 808 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 450 కోట్లు పెండింగ్ బిల్లులకు పోతే మిగిలిన రూ. 358 కోట్లు నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ఏమూలకూ సరిపోవు. దీంతో భారం తగ్గించుకునేందుకు వీలుగా పునాదులకు నోచుకోని ఇళ్ల వివరాలను జిల్లాల వారీగా సేకరించి వాటిని రద్దు చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో 24,581, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరులో 78,095, శ్రీకాకుళంలో 74,750, విశాఖపట్నంలో 61,956, విజయనగరంలో 73,735, పశ్చిమ గోదావరిలో 69,801, అనంతపురంలో 81,292, చిత్తూరులో 85,212, తూర్పు గోదావరిలో 84,628, వైఎస్సార్ జిల్లాలో 29,299, కృష్ణాలో 59,087, కర్నూలులో 94,285, గుంటూరులో 64,657 ఇళ్లను రద్దు విషయమై ఆయా జిల్లాలకు సమాచారం పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను ఆధార్‌తో అనుసంధానిస్తే మరికొన్ని ఇళ్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆధార్ అనుసంధానంపై ఇప్పటికే జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ ఏడాది రాష్ర్టం నుంచి కొత్తగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఏవై పథకంలో మంజూరైన 25 వేల ఇళ్లతో సరిపెట్టుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకే పరిమితం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాలకు కొత్తగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే పరిస్థితి కన్పించడం లేదు.
సిమెంటు, ఐరన్, ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా మంది లబ్ధిదారులు పునాదులు తీసుకోలేకపోయారు. తనకు అధికారమిస్తే ఎస్సీ, ఎస్టీలకు రూ.1.50 లక్షలు, ఇతరులకు లక్ష రూపాయల వరకు యూనిట్ ధర పెంచుతానని పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో యూనిట్ ధర పెరిగి తాము ఇళ్లు పూర్తి చేసుకుంటామని పేద ప్రజలు ఆశగా ఎదురు చూశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది.