నిర్మాణం జాప్యం.. నిధులు వెనక్కి
ఆగిపోయిన ఆరు స్టేడియాల నిర్మాణాలు
నత్తనడకన సాగుతున్న ఏడు మినీ స్టేడియాలు
కర్నూలులో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల జాడే లేదు
కల్లూరు: ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ఏడాదిన్నర కాలంగా వివిధ కారణాలతో స్టేడియం నిర్మాణాలు చేపట్టలేదు. తాజాగా పాణ్యం, ఆదోని, బనగానపల్లె, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, మంత్రాలయం నియోజక వర్గాల్లో స్టేడియం నిర్మాణాలను పూర్తిగా నిలిపివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన రూ. 2.10 కోట్ల నిధులు మొత్తం రూ. 12.60కోట్లు వెనక్కి వెళ్లాయి. ఆత్మకూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, డోన్, ఆలూరు, నంద్యాల, పత్తికొండలో మినీ స్టేడియం నిర్మానాలు నత్తనడకన సాగుతున్నాయి. కర్నూలు జిల్లా కేంద్రంలో రూ.6.72 కోట్లతో అవుట్‌డోర్ స్టేడియంలో చేపట్టిన క్రీడాభవనం, ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులూ నిదానంగా సాగుతున్నాయి. ఇక కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల జాడే కనిపించడం లేదు. ఇటీవల కర్నూలులో నిర్మిస్తున్న స్టేడియం పనులను కలెక్టర్ విజయమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు ముందుకెళ్లకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి చివరికల్లా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. లేకపోతే రూ. 5 లక్షలు జరిమానా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎనిమిది నియోజకవర్గాల్లోనూ మార్చి చివరిలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.