కొత్త జిల్లాలకు పెరుగుతున్న డిమాండ్
► కొత్త జిల్లాలపై అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు
► జోగుళాంబ జిల్లాపై జోరుగా ఊహాగానాలు
► గురువారం నారాయణపేటలో జేసీ ప్రజాభిప్రాయ సేకరణ
► శుక్రవారం వనపర్తి, గద్వాలలో పర్యటన
► మా ప్రాంతమంటే మాప్రాంతాన్నే జిల్లా చేయాలని వినతులు
మహబూబ్‌నగర్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేయడంతో మరికొన్ని ప్రాంతాలను జిల్లాలుగా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. 64 మండలాలతో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించిన నేపథ్యంలో తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ గద్వాల, నారాయణపేట ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతోపాటు వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించారు. గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలని మూడు నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతుండడమే కాకుండా స్థానిక శాసనసభ్యురాలు డీకే అరుణ ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి గద్వాల జిల్లాగా చేయడానికి గల సానుకూల అంశాలను వివరించారు.
గద్వాలను జిల్లా చేయడానికి ప్రభుత్వం అంగీకరించని పక్షంలో ఆమరణ నిరాహారదీక్ష చేయాలని భావిస్తున్న డీకే అరుణ ఈ మేరకు తన అనుచరులతో సమాలోచనలు జరిపారు. అలాగే గద్వాల జిల్లాను చేయాల్సిన అవశ్యకతను వివరిస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అన్ని హంగులు, అర్హతలు కలిగిన గద్వాలను జిల్లా కేంద్రంగా చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఇందు వల్ల పాలన సౌలభ్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని వారు ఆ వినతిపత్రంలో వివరించారు.
జోగుళాంబపై ఊహాగానాలు..
ఇక నారాయణపేటను జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఇప్పటికే ఆ ప్రాంతానికి చెందిన పలు పార్టీల ఆధ్వర్యం లో ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. నాగర్‌కర్నూ ల్, వనపర్తితోపాటు మరో జిల్లాను చేయడంపై సాధ్యాసాధ్యాలను ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉ న్న ప్రముఖ దేవాలయాల పేరుతో జిల్లా కేంద్రాలు ఏర్పాటుచేస్తున్న ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన జోగుళాంబ పేరుతో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. జోగుళాంబ పేరుతో జిల్లాను ప్రకటించి గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదే తరహాలో మరికొన్ని రాజకీయ పక్షాలు సైతం జోగుళాంబ జిల్లా చేయడం వలన కలిగే ప్రయోజనాలపై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త జిల్లాలను ప్రభుత్వం ప్రకటిస్తే వాటి కేంద్రాలుగా ఏయే ప్రాంతాలుంటాయన్న అంశం సైతం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వనపర్తి జిల్లాగా ప్రకటించి జిల్లా కేంద్రంగా మాత్రం పెబ్బేరు చేస్తారన్న ఊహాగానాలు సైతం పెద్దఎత్తున చెలరేగుతున్నాయి. అలాగే జోగుళాంబ జిల్లాకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న జేసీ...
కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లపై క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్ కొద్ది రోజులుగా కొత్త జిల్లాలు కోరుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే నారాయణపేట ప్రాంతంలో పర్యటించారు. అక్కడ జిల్లా కేంద్రం అవడానికి గల భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ భవనాలు, భూములు, రవాణా సదుపాయం, ఏయే ప్రాంతాల ప్రజలు పాలన పరంగా సౌకర్యవంతంగా ఉంటుందన్న అంశంపై సమగ్ర సమాచారాన్ని సేకరించారు. శుక్రవారం వనపర్తి, గద్వాల రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సైతం జేసీ పర్యటించి ఇదే తరహా సమాచారాన్ని సేకరించారు.