=గతేడాదితో పోలిస్తే పెరిగిన బాధితులు
=493 మంది రక్తనమూనాల పరిశీలన
=నిర్ధారిస్తున్న ఏఎంసీ గణాంకాలు
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్ : జిల్లాలో డెంగ్యూ జ్వరాల తీవ్రత గతేడాది కంటే అధికంగా ఉన్నట్టు ఆంధ్రవైద్య కళాశాల(ఏఎంసీ) మైక్రో బయాలజీ విభాగం గణాంకాల ప్రకారం తెలుస్తోంది. ఈ ఏడాది ఎపిడమిక్ సీజన్ ప్రారంభమైన జూన్ నుంచి ఇప్పటివరకూ మొత్తం 493 మంది జ్వర అనుమానితుల రక్తనమూనాలు ఈ విభాగానికి వచ్చాయి. ఇందులో 167 మందికి డెంగ్యూ ఉన్నట్టు నిర్ధారణ అయింది. గత ఏడాది మొత్తం 163 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.
ఐదు నెలలకే 167 కేసులు నమోదు కావడంతో ఈ ఏడాది పూర్తయ్యేసరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ జ్యోతి పద్మజ అభిప్రాయపడ్డారు. విశాఖ నగర పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది వరదలు, పారిశుద్ధ్య నిర్వహణ లోపాల వల్ల దోమలు విజృంభిస్తున్నాయి. అదే స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అధికారికంగా నిర్ధారించనప్పటికీ మృతులు పది మందికి దాటే ఉంటారన్న వాదన వ్యక్తమవుతోంది.
వైరల్ వ్యాధుల నిర్ధారణకు ఉపకరించే ఎలిసా పరీక్ష నిర్వహణకు అవసరమైన యంత్ర పరికరాలు, కిట్లు కేజీహెచ్‌లో అందుబాటులో ఉన్నాయని డాక్టర్ జ్యోతి పద్మజ చెప్పారు. జ్వరం వచ్చిన కొద్ది రోజుల్లోనే వైరస్ నిర్ధారణకు చేసే ఐజీఎం యాంటీ బాడీస్ వైద్య పరీక్షను మాత్రమే ప్రస్తుతం చేస్తున్నామన్నారు. రోగి శరీరంలో గతంలో వైరస్ ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారించేందుకు చేసే ఐజీజీ యాంటీబాడీ పరీక్ష మాత్రం సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం చేయడం లేదన్నారు.
ఈ నెలాఖరులోగా వైరాలజీ ల్యాబ్ : వివిధ రకాల వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధుల నిర్ధారణకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గ్రేడ్-2 వైరాలజీ లేబొరేటరీని కేజీహెచ్‌లో నెలాఖరులోగా వినియోగంలోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఈ ల్యాబ్‌కు సం బంధించిన యంత్ర పరికరాలు దశలవారీగా వస్తున్నాయన్నారు. ఈ ల్యాబ్‌ను కేజీహెచ్‌లోని రాజేంద్రప్రసాద్ వార్డులోని పాత గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పనులు మరో 20 రోజుల్లో పూర్తవుతాయని, నెలాఖరున ప్రారంభించే అవకాశముందన్నారు. దీనికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎన్‌ఆర్) నిధులను సమకూర్చిందన్నారు. ఈ ల్యా బ్‌లో ఎలిసా పరీక్షతో పాటు పీసీఆర్, ఇన్యూనోఫ్లోరసెన్స్ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవకాశముందన్నారు. మైక్రోబయాలజీ విభాగంలో ఉన్న ల్యాబరేటరీని గ్రేడ్-2 ల్యాబ్ పూర్తయితే అక్కడకు తరలిస్తామని చెప్పారు.