నేటినుంచి దీక్షల విరమణ
=ఐదురోజులపాటు కొనసాగింపు
=రాత్రి 11 గంటల వరకు దర్శనాలు
= సౌకర్యాలు అంతంతమాత్రమే
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీదీక్షల విరమణ కార్యక్రమం సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది. ఐదురోజుల పాటు ఈ దీక్షల కార్యక్రమం కొనసాగుతుంది. తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చిన అనంతరం ఆలయ అర్చకులు, ఈవో త్రినాధ్ తదితరులు మేళతాళాలతో మల్లికార్జున మహామండపం వద్ద ఏర్పాటుచేసిన హోమగుండాల వద్దకు చేరుకుంటారు. అక్కడ ఉదయం 6.40 గంటలకు హోమగుండాల్లో అగ్నిప్రతిష్టాపన చేసిన తరువాత భవానీ భక్తుల దీక్షల విరమణ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆలయ స్థానాచార్య వి.శివప్రసాద్ తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు దేవాలయంలో చండీహోమం నిర్వహిస్తారు.
అర్ధరాత్రి వరకు దర్శనాలు
ప్రతిరోజు తెల్లవారుజామున అమ్మవారికి నిత్యపూజల అనంతరం మూడు గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 26న దర్శనం సమయం పెంచారు. అర్ధరాత్రి 11 గంటలకు ఆలయం మూసిన తరువాత తెల్లవారుజామున 1.30 గంటలకే తిరిగి భక్తులకు అనుమతిస్తారు. 27వ తేదీ శుక్రవారం కావడంతో భక్తులు ఇరుముడులు తీయకపోవచ్చని భావిస్తున్న అధికారులు తరువాత రెండు రోజులు ఇరుముడులు సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భవానీ భక్తులకు దీక్షల విరమణ గురించి అర్థమయ్యేలా ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు.
సమస్యలు యథాతథం...
దీక్షల విరమణకు పటిష్ట ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పుకొంటున్నా సమస్యలు యథాతథంగా కనిపిస్తున్నాయి. భక్తులు తలనీలాలు సమర్పించాలన్నా ఇబ్బంది పడుతున్నారు. సీతమ్మవారి పాదాలు, దుర్గాఘాట్, పద్మావతి ఘాట్ వద్ద నడిరోడ్డుమీదే నిలబడి ప్రైవేటు క్షురకులతో తలనీలాలు తీయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భవానీ దీక్షలు చేపట్టి వచ్చే భక్తులతో పాటు వారి కుటుంబసభ్యులకు సరైన సౌకర్యం కల్పిస్తే గిరిప్రదక్షిణపై రద్దీ తగ్గుతుంది. ప్రస్తుతం సౌకర్యాలు లేకపోవడంతో భక్తులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా గిరిప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
మూడు గంటలకు పైగా క్యూలో నిలబడి చివరకు అమ్మవారి దర్శనం వద్దకు వచ్చేసరికి క్షణమైనా నిలబడనీయకుండా సిబ్బంది లాగివేయడం భక్తులను మనస్థాపానికి గురిచేస్తుంది. అమ్మవారి ఎదుట ఒక్క నిమిషం నిలబడి తమ మొర చెప్పుకొందామనే సగటు భక్తుడికి నిరాశే ఎదురవుతుంది. ఇక హోమగుండాలు, ఇతర ఉపాలయాల వద్ద అర్చకులు డబ్బు గుంజడం మామూలే.
భవానీ భక్తులు మొక్కుకోకుండానే నిలువుదోపిడీ ఇచ్చి వెళుతూ ఉంటారు. అర్ధరాత్రి గజగజ వణికించే చలిలో నడిరోడ్డుపైనే పడుకోవాల్సి ఉంటుందే తప్ప దేవస్థానం కనీసం స్థలం కూడా చూపించదు. కోట్లు వెచ్చించి నిర్మించే భవనాలు దేవస్థానం ఉద్యోగులు, ఇతర దేవస్థానాల నుంచి వచ్చే సిబ్బందికే సరిపోతాయి తప్ప సగటు భక్తుడికి ఏమాత్రం అందుబాటులో ఉండవు.