అనంతపురం న్యూసిటీ: ప్రైవేట్ నర్సింగ్ హోం, ఆస్పత్రుల్లో ఫార్మసిస్టులు లేకుండానే మందులు విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీలో బట్టబయలైంది. బుధవారం ‘మెడికిల్స్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఔషధ నియంత్రణ, ఆహార కల్తీ నిరోధక శాఖల అధికారులు స్పందించారు. నగరంలోని కమలానగర్‌లోని ఎస్‌వీ, మైత్రి ఆస్పత్రులను ఆహార కల్తీ నిరోధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.నాగేశ్వరయ్య, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పి.సంధ్య సంయుక్తంగా దాడులు చేశారు. మెడికల్ షాపుల్లో శ్యాంపిల్స్ అమ్ముతున్నారా, ఎక్స్‌పైర్డ్ అయిన ఆహార పదార్థాలు ఏమైనా విక్రయిస్తున్నారా అని నిశితంగా పరిశీలించారు. ఎస్‌వీ ఆస్పత్రిలో ఫార్మసిస్టు ఫణికుమార్ ఎక్కడ అని అక్కడ పనిచేసే యువకుడిని ప్రశ్నిస్తే ఎటువంటి సమాధానం రాలేదు. అనంతరం మందుల విక్రయ బిల్లులను పరిశీలించారు. ఫార్మసిస్టు లేకుండా మందులు విక్రయించకూడదన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. మైత్రి ఆస్పత్రిలో ఆదిలక్ష్మి పేరుపై ఫార్మసీ ఉండగా.. అక్కడ ఆమె కనిపించలేదు. ఇద్దరు అమ్మాయిలు మాత్రమే విధుల్లో కనిపించారు. ఫార్మసీలో కలర్లు, కొబ్బరినూనె ఎందుకు ఉంచారని ఆహార కల్తీ నిరోధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.నాగేశ్వరయ్య నిర్వాహకులను ప్రశ్నించారు. కేవలం మందులు మాత్రమే అమ్మాలని ఆదేశించారు.
మైత్రి, ఎస్‌వీ ఫార్మసీలపై కేసు
ఫార్మసిస్టులు లేకుండా మందులు విక్రయిస్తున్న మైత్రి, ఎస్‌వీ ఆస్పత్రుల్లోని ఫార్మసీలపై కేసు నమోదు చేస్తున్నట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పి.సంధ్య తెలిపారు. ప్రజారోగ్యంపై చెలగాటమాడితే ఊరుకునేది లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. శాంపిల్స్, నిషేధిత మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహార కల్తీ నిరోధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరయ్య మాట్లాడుతూ ఎక్స్‌పైర్డ్ అయిన ఆహార పదార్థాలు విక్రయించరాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment