private nursing home
-
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా?
అనంతపురం న్యూసిటీ: ప్రైవేట్ నర్సింగ్ హోం, ఆస్పత్రుల్లో ఫార్మసిస్టులు లేకుండానే మందులు విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీలో బట్టబయలైంది. బుధవారం ‘మెడికిల్స్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఔషధ నియంత్రణ, ఆహార కల్తీ నిరోధక శాఖల అధికారులు స్పందించారు. నగరంలోని కమలానగర్‌లోని ఎస్వీ, మైత్రి ఆస్పత్రులను ఆహార కల్తీ నిరోధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.నాగేశ్వరయ్య, డ్రగ్ ఇన్స్పెక్టర్ పి.సంధ్య సంయుక్తంగా దాడులు చేశారు. మెడికల్ షాపుల్లో శ్యాంపిల్స్ అమ్ముతున్నారా, ఎక్స్పైర్డ్ అయిన ఆహార పదార్థాలు ఏమైనా విక్రయిస్తున్నారా అని నిశితంగా పరిశీలించారు. ఎస్వీ ఆస్పత్రిలో ఫార్మసిస్టు ఫణికుమార్ ఎక్కడ అని అక్కడ పనిచేసే యువకుడిని ప్రశ్నిస్తే ఎటువంటి సమాధానం రాలేదు. అనంతరం మందుల విక్రయ బిల్లులను పరిశీలించారు. ఫార్మసిస్టు లేకుండా మందులు విక్రయించకూడదన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. మైత్రి ఆస్పత్రిలో ఆదిలక్ష్మి పేరుపై ఫార్మసీ ఉండగా.. అక్కడ ఆమె కనిపించలేదు. ఇద్దరు అమ్మాయిలు మాత్రమే విధుల్లో కనిపించారు. ఫార్మసీలో కలర్లు, కొబ్బరినూనె ఎందుకు ఉంచారని ఆహార కల్తీ నిరోధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.నాగేశ్వరయ్య నిర్వాహకులను ప్రశ్నించారు. కేవలం మందులు మాత్రమే అమ్మాలని ఆదేశించారు. మైత్రి, ఎస్వీ ఫార్మసీలపై కేసు ఫార్మసిస్టులు లేకుండా మందులు విక్రయిస్తున్న మైత్రి, ఎస్వీ ఆస్పత్రుల్లోని ఫార్మసీలపై కేసు నమోదు చేస్తున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ పి.సంధ్య తెలిపారు. ప్రజారోగ్యంపై చెలగాటమాడితే ఊరుకునేది లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. శాంపిల్స్, నిషేధిత మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహార కల్తీ నిరోధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరయ్య మాట్లాడుతూ ఎక్స్పైర్డ్ అయిన ఆహార పదార్థాలు విక్రయించరాదన్నారు. -
వైద్యం వికటించి మహిళ మృతి!
♦ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన ♦ తుర్కపల్లిలోని ప్రైవేటు నర్సింగ్‌హోంలో ఘటన శామీర్‌పేట్ : వైద్యం వికటించి మిహళ మృతిచెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువుల ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుర్కపల్లిలో శనివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా మొలుగు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన మన్నె లక్ష్మి(42), రాజయ్య దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మి తుర్కపల్లిలోని రాజీవ్ రహదారి పక్కన ఉన్న ఓ నర్సింగ్ హోంలో చేరింది. ఈక్రమంలో ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం లక్ష్మి ఆస్పత్రిలో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే లక్ష్మి మృతిచెందిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. డాక్టర్లు చేసిన ఆపరేషన్ ఫెయిలవడంతో మృత్యువాతపడిందని మండిపడ్డారు. దీంతో వారు నర్సింగ్ హోం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో రాజీవ్ రహదారిపై వాహనాలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న శామీర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఆందోళనకారులను సముదాయించి శాంతింపజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. -
38 మంది వృద్ధుల సజీవ దహనం
చైనాలో భారీ అగ్ని ప్రమాదం బీజింగ్: చైనాలోని హెనాన్ రాష్ట్రంలో సోమవారం ఓ ప్రైవేట్ వృద్ధాశ్రమంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 38 మంది వృద్ధులు సజీవ దహనం అయ్యారు. మరో ఆరుగురు గాయపడ్డారు. పింగ్దింగ్షాన్ సిటీలోని లూషాన్ కౌంటీలో ఉన్న కాంగ్లెయూవాన్ రెస్ట్ హోంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతదేహాలు గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి. సోమవారం సాయంత్రం మొదలైన మంటలు మొత్తం వృద్ధాశ్రమంలోని భవనాలన్నింటికి వ్యాపించాయని, గంట తర్వాత వాటిని ఆర్పేశామని అధికారులు తెలిపారు. వృద్ధాశ్రమంలో మొత్తం 51 మంది వృద్ధులు ఉండేవారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మంటల ధాటికి భవనాలు కూలిపోయి బూడిద కుప్పలా మారిపోయాయి. తన గదిలో 11 మంది ఉండేవారని, తనతోపాటు మరొకరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డామని జావో యులాన్ అనే మహిళ చెప్పింది. రెస్ట్ హోం లీగల్ ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సంతాన ‘లక్ష్మి’
రాజాంరూరల్: పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో రాజాం మండలం ఒమ్మి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. ఆదిలక్ష్మికి జి.సిగడాం మండలం జామి గ్రామానికి చెందిన కుప్పిలి రాముతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. నాలుగేళ్ల కిందట ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిం ది. రెండో సంతానంలో ఒకే సారి ముగ్గురు బిడ్డలు జన్మించడం, ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జన్యుపరమైన కారణాలతో ఇలాంటి జననాలు అరుదుగా జరుగుదాయని ఆస్పత్రి వైద్యుడు జి.హనుమంతరావు తెలిపారు. -
ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువు మృతి
మహబూబ్‌నగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో ఓ 20 రోజుల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... 20 రోజుల కిత్రం నవాబుపేట మండలం ఫత్తేపూర్‌కు చెందిన మల్లేశ్వరిని కాన్పు కోసం మహబూబ్‌నగర్ పట్టణంలోని సుసృత ప్రజా వైద్యశాలకు భర్త కాశీమయ్యగౌడ్ తీసుకురాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటకే ఆమె కు ఇద్దరు అడపిల్లలున్నారు. దీంతో భార్యాభర్తలతో పాటు బంధువుల సంతోషానికి అవధులులేవు. అయితే మరుసటి రోజు శిశువుకు నిమోనియా వచ్చిందంటూ వైద్యులు చెప్పి మూడురోజుల పాటు చికిత్సలు అందించారు. చివరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో శిశువును నవోదయ ఆస్పత్రికి తరలించారు. శిశువుకు ప్రతిరోజూ రూ.13 వేల చొప్పున చెల్లించి ప్రత్యేక గదిలో ఉంచి వైద్య చికిత్సలు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే శని వారం ఉదయం తెల్లవారుజామున బాధితులను లేపి మిగతా రూ.30 వేలు చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి తె చ్చారు. అనుమానం రావడంతో తమ బిడ్డను చూయిస్తేనే డబ్బులు కడతామని చెప్పడంతో శిశువు రాత్రి చనిపోయిందని వారిని సిబ్బంది బయటకు గెంటి వేశారు. ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువు లు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. శిశువు చనిపోయిన విషయం దాచి రోజు చికిత్సలు చేస్తున్నట్లు నటించి డబ్బులు కట్టించుకున్నారని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడన్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాధితులను సముదాయించారు. చివరకు ఆస్పత్రి నిర్వాహాకులతో చర్చించి బాధితులు చెల్లించిన రూ.1.6 లక్షలతో పాటు మరో రూ.20 వేలు అదనంగా ఇ ప్పించి సమస్యను పరిష్కరించి గొడవ సద్దుమణిగించారు.దీంతోవారు మృతశిశువును ఇంటికి తీసుకెళ్లారు.