కాకినాడ : ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. విభజనకు వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేసిన ఈ ప్రాంత ప్రజలు విధిలేని స్థితిలో కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చి పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా హక్కు పొందారని పేర్కొన్నారు. చట్టసభలో స్వయంగా ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఆపడం, ఈ డిమాండ్‌ను ప్రత్యేక ప్యాకేజీగా మార్చేందుకు యత్నించడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ఈ నెల 29న నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌పై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఆదివారం సాయంత్రం స్థానిక జేఎన్‌టీయూ కళాశాల ఆవరణలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ధర్మాన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
ప్రత్యేక హోదావల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం మాత్రం గంటకో మాట చెబుతూ ప్రత్యేక హోదా అంశాన్ని దారిమళ్లిస్తోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాత్కాలిక ప్రత్యేక ప్యాకేజీలు ఆమోదం కాదని, చట్టపరమైన ప్రత్యేక హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు కావాలని స్పష్టం చేశారు. 29న జరిగే బంద్‌ను సంపూర్ణంగా నిర్వహించి ప్రభుత్వం కళ్ళు తెరిపించేలా ఉద్యమించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా, కార్మిక, ఉద్యోగ, రాజకీయ సంఘాలూ దీనిలో భాగస్వాములు కావాలని కోరారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ మన వాణి ఢిల్లీలో ప్రతిధ్వనించేలా బంద్‌ను జయప్రదం చేద్దామని సూచించారు. సీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పినపే విశ్వరూప్ మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రులు జైట్లీ, వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదా అంటూ నమ్మబలికి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు.
సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, చిర్లజగ్గిరెడ్డి, దాడిశెట్టిరాజా మాట్లాడుతూ టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు చంద్రబాబుపాలనపై వంగ్యోక్తులతో చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. చివరగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు వందన సమర్పణ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, తోట సుబ్బారావునాయుడు,
ఆకుల వీర్రాజు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, గుత్తుల సాయి, గిరిజాల వెంకటస్వామినాయుడు, వేగుళ్ళ లీలాకృష్ణ, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, జిల్లా అధికార ప్రతినిధులు సబ్బెళ్ళకృష్ణారెడ్డి, ఆదిత్యకుమార్, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ, రాష్ట్ర మహిళా కార్యదర్శి పెదిరెడ్డి రామలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శులు సంగిశెట్టి అశోక్, మిండకుదిటి మోహన్, కర్రి పాపారాయుడు, జడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, అనుబంధ విభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, జున్నూరు వెంకటేశ్వరరావు, మట్టపర్తి మురళీకృష్ణ, మార్గాని గంగాధర్, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, పెట్టా శ్రీనివాస్, ఎం.అప్పన్నదొర, కొల్లి నిర్మలాకుమారి, అబ్దుల్‌బషీరుద్దీన్, సిరిపురపు శ్రీనివాసరావు,ముమ్మిడివరం పంచాయతీ ఫ్లోర్‌లీడర్ ముని కుమారి, పలువురు రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో హోదా సాధన
Published Mon, Aug 24 2015 1:16 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement