ప్రత్యేక హోదాపై ఒత్తిడి పెంచేందుకే..
ఢిల్లీ ధర్నాపై వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన
ధర్నా ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించిన పార్టీ నేతలు
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 10న ఢిల్లీ ధర్నాకు పిలుపునిచ్చిందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయనతోపాటు పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, సాగి దుర్గాప్రసాదరాజు, అంబటి రాంబాబు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాప్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ ధర్నా ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ధర్మాన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగే అన్యాయ్యాన్ని సరిదిద్దడానికే ప్రత్యేకహోదా అంశం పుట్టుకొచ్చిందన్నారు. అది కేవలం హామీ మాత్రమే కాదని.. అన్యాయం జరిగిన ప్రాంతానికి న్యాయం చేయడం లాంటిదని చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా మొదట్నుంచీ ప్రత్యేక హోదా సాధనకోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతోందని.. దానికి కొనసాగింపుగానే ఢిల్లీ ధర్నాకు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు.
ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచే చర్యలు చేపట్టకపోవడం రాష్ట్ర ప్రజలందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోందన్నారు. టీడీపీ కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా, రాష్ట్రంలో అధికారంలో ఉండి చంద్రబాబు దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని ధర్మాన ప్రశ్నించారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రులు దీనిని చిన్న విషయంగా భావిస్తున్నారని తప్పుపట్టారు. నష్టపోయిన ప్రజలపక్షాన ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఢిల్లీ ధర్నాలో రాష్ట్ర ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి తరలివెళ్లిన కార్యకర్తల తో ధర్నా నిర్వహించిన అనంతరం ర్యాలీగా పార్లమెంట్ వైపునకు వెళ్లే కార్యక్రమం ఉంటుందని బొత్స సత్యనారాయణ చెప్పారు.