సాక్షి, విశాఖపట్నం: అవశేష ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)కు రాజధానిని ఎంపిక చేయడంలో గోప్యత పాటించడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎన్నికల ఫలితాల సమీక్షకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజధాని నిర్మాణంపై ప్రజల్లో ఒకవైపు ఆసక్తి, మరోవైపు ఆందోళన ఉన్నాయి. మీడియా కథనాలతో తెరచాటు వ్యవహారాలపై అనుమానాలు పెరుగుతున్నాయి. మూ డు పట్టణాలు కలిపి రాజధానిగా చేస్తామని ఒకరు.. రెండు పట్టణాలు కలిపి నిర్మిస్తామని మరొకరు చెబుతున్నారు. ఇది మరింత పారదర్శకంగా ఉండాలని అధికార పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా’’నని అన్నారు.