ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ ఏడాదీ నేల మీద రాతలు తప్పేలా లేవు. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి పరీక్ష రాయించొద్దన్న ఉన్నతాధికారుల ఆదేశాలు అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ కార్యాలయం పరీక్ష కేంద్రాలున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు ఫర్నిచర్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. మొక్కుబడిగా కొన్ని పాఠశాలలకు తక్కువ సంఖ్యలో బల్లలు సరఫరా చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో విద్యార్థులు నేలమీద కూర్చుని పరీక్ష రాస్తూ అవస్థలు పడాల్సి వస్తోంది.
జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 39,601 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 195 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 86 పరీక్ష కేంద్రాలకు మాత్రమే పూర్తి స్థాయిలో ఫర్నిచర్ ఉంది. 93 పాఠశాలల్లో 50 శాతం ఉండగా 16 పరీక్ష కేంద్రాల్లో అసలు ఫర్నిచరే లేదు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో 11,311 మంది విద్యార్థులు నేలమీద కూర్చుని పరీక్ష రాయక తప్పదు.
ఫర్నిచర్ లేని పరీక్ష కేంద్రాలివే..
జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు కూర్చునేందుకు ఒక్క బల్ల కూడా అందుబాటులో లేదు. తాళ్లూరు సరస్వతి హైస్కూల్, కందుకూరు జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్, దర్శి, సింగరాయకొండ, కొండపి ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లు, దూపాడు ఏపీ రెసిడెన్షియల్ బాలికల హైస్కూల్, ముండ్లమూరు జెడ్పీ హైస్కూల్-బీ కేంద్రం, వేటపాలెం జెడ్పీ బాలికల హైస్కూల్-బీ కేంద్రం, ఇంకొల్లు జెడ్పీ హైస్కూల్- బీ కేంద్రం, ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల-బీ కేంద్రం, గుడ్లూరు జెడ్పీ హైస్కూల్-బీ కేంద్రం, పీసీపల్లి, సీఎస్ పురం, వెలిగండ్ల జెడ్పీ హైస్కూళ్లలోని బీ కేంద్రాలు, మార్కాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, కంచర్లపల్లి జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్ లేదు.
కొత్త పరీక్ష కేంద్రాలు ఇవీ..
ఈ ఏడాది కొత్తగా అమ్మనబ్రోలు(బాలికలు), సంతనూతలపాడు(బాలురు) ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు, కురిచేడు జిల్లా పరిషత్ హైస్కూల్, ముండ్లమూరు జిల్లా పరిషత్ హైస్కూళ్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం ఉన్నందన అక్కడి సెంటర్‌ను అన్నవరప్పాడులోని శ్రీ సూర్య విద్యానికేతన్‌కు మార్చారు. సంతమాగులూరులోని బాలాజీ హైస్కూల్లో పరీక్ష కేంద్రాన్ని తొలగించారు.
ఫర్నిచర్ సరఫరా చేస్తాం : డీఈఓ రాజేశ్వరరావు
పరీక్ష కేంద్రాలకు ఫర్నిచర్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పరీక్ష కేంద్రాలు, పరీక్షలు రాసే విద్యార్థులు చదువుతున్న ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలను సమన్వయం చేసి బల్లల కొరత లేకుండా చూడాలని ఎం ఈఓలను ఆదేశించాం. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తున్నాం.
మాకెందుకీ ‘పరీక్ష’?
Published Tue, Mar 25 2014 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
Advertisement
Advertisement