సాక్షి ప్రతినిధి, కర్నూలు:
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సమైక్యవాదులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ధర్నాలు.. రాస్తారోకోలు.. మానవహారాలతో పాటు ఆమరణ దీక్షలకూ వెనకడుగు వేయకపోవడం వారి పోరాటస్ఫూర్తికి నిదర్శనం. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడం.. ప్రభుత్వ వైద్యులు విధులు బహిష్కరించడంతో సమైక్య ఉద్యోమం మహోద్ధృతమవుతోంది. సోమవారం సుంకేసుల జలాశయం వద్ద చేపట్టిన రైతు శంఖారావం రైతులు, పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. మాజీ ఎంపీపీ విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే బ్యారేజీ పైకి వెళ్లకుండా కేసీ కెనాల్ గట్టుపై సభ జరుపుకోవాలని పోలీసులు సూచించడంతో రైతులు ససేమిరా అన్నారు. జలాశయంపైనే సభ జరిపి తీరుతామని ముందుకు కదలడంతో రైతులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బారికేడ్లను తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
ఈ సమయంలో కొందరు రాళ్లు, చెప్పులు రువ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు పోలీసు అధికారులు ఎస్పీతో చర్చించి జలాశయంపై 13వ గేటు వరకు వెళ్లేందుకు అనుమతివ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఇక విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెతో ఆదివారం జిల్లా అంధకారంలో మగ్గడం తెలిసిందే. సోమవారం కూడా శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా కేబినెట్ తీర్మానానికి నిరసనగా ప్రభుత్వ వైద్యులు విధులను బహిష్కరించారు. ఫలితంగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్లు వాయిదా పడ్డాయి. రోజూ సుమారు 1500 మంది వరకు చికిత్స నిమిత్తం వచ్చే ఆసుపత్రి ఓపీ బోసిపోయింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైద్యులంతా కలెక్టరేట్ కూడలిలో భారీ మానవహారం నిర్వహించడంతో రాకపోకలు స్తంభించాయి. నగరంలో పలుచోట్ల సమైక్యవాదులు ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు.
నంద్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆలూరులో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో బొత్స, సోనియా వేషధారులు చీరలు కట్టుకుని ర్యాలీ చేశారు. వీరికి కూరగాయల దండ వేసి చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. ఆదోనిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలు పట్టణంలో ర్యాలీ చేపట్టి భీమాస్ కూడలిలో మానవహారం నిర్వహించారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా రాస్తారోకో చేపట్టారు. అధ్యాపక, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. డోన్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కోవెలకుంట్లలో జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేసి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. కోసిగిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పత్తికొండలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. కోడుమూరు, లద్దగిరి, గూడూరు, పోలకల్లుకు చెందిన వైద్యులు సోనియా దిష్టిబొమ్మకు పోస్టుమార్టం చేసి గుండె, బ్రెయిన్ లేదని తేల్చారు. నందవరంలో సమైక్యవాదులు ఎమ్మిగనూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆత్మకూరులో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేయడంతో రాకపోకలు స్తంభించాయి.
సడలని దీక్ష.. సమైక్య రక్ష
Published Tue, Oct 8 2013 3:52 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement