రైల్వే జోన్ కోసం ఆందోళన ఉధృతం
నేడు వైఎస్సార్‌సీపీ రౌండ్ టేబుల్ సమావేశం
14 నుంచి నిరవధిక దీక్షకు ‘గుడివాడ’ సిద్ధం
విశాఖపట్నం: తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో ఆదాయాన్ని తెచ్చిపెట్టే అ తిపెద్ద్ద డివిజన్ వాల్తే రు. రైల్వే జోన్ మొత్తమ్మీద వచ్చే ఆదాయంలో సగానికి పైగా ఈ డివిజన్ నుంచే వస్తోంది. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు, సరకు రవాణా ద్వారా వాల్తేరు డివిజన్‌కు దాదాపు రూ.7 వేల కోట్ల రాబడి సమకూరుతోంది. ఒక్క సాధారణ టిక్కెట్ల ద్వారానే రోజుకు రూ.25 లక్షలు తెస్తోంది. అయినా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యమే చూపుతోంది. ఏళ్ల తరబడి ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా మునుపటి, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలోనూ వాల్తేరు జోన్ ఏర్పాటు అంశాన్ని పేర్కొనడంతో 2015, 2016 రైల్వే బడ్జెట్‌లలో ప్రకటిస్తారని ఆశించినా ఫలితం లేదు. వాల్తేరు డివిజన్ రైల్వేకి ఆదాయాన్ని తెచ్చే బంగారు బాతుగుడ్డులా మారడంతో దీనిని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోనూ అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీ ఎంపీలే ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీలు చిక్కినప్పుడలా జోన్ ఇదిగో వచ్చేస్తుంది.. అదిగో వచ్చేస్తోందంటూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు నానా హడావుడీ చేసేస్తున్నారు. చివరికి మొండి చేయే చూపిస్తున్నారు. విశాఖపట్నం డివిజన్‌ను ప్రత్యేక జోన్ చేయడానికి అర్హతలు లేవా? అంటే మిగతా జోన్లకంటే ఎక్కువ అవకాశాలు, అర్హతలు దీనికే ఉన్నాయి. కానీ విశాఖకంటే తక్కువ వనరులు, డివిజన్లున్న ఇతర రాష్ట్రాల్లో రైల్వే జోన్‌లు ఏర్పాటు చేసేశారు. పైగా ఏ కమిటీలు వేయకుండానే ఆయా రాష్ట్రాల్లో జోన్‌లు ఏర్పాటవగా, విశాఖ జోన్ ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ఓ కమిటీ వేసి కాలయాపన చేస్తూ వస్తున్నారు.
చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్, బిలాస్‌పూర్ డివిజన్లున్నాయి. కానీ అక్కడ బిలాస్‌పూర్ డివిజన్ ఇచ్చారు. తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లుండగా హైదరాబాద్ జోన్ ఏర్పాటు చేశారు. కర్నాటకలో హుబ్లి, మైసూర్, బెంగళూరు డివిజన్లతో హుబ్లి జోన్ ఇచ్చారు. ఒడిశాలో సంబల్‌పూర్, ఖుర్దా డివిజన్లకు భువనేశ్వర్‌లో జోన్ ఏర్పాటు చేశారు. కానీ విశాఖకు విశాఖపట్నం, గుంతకల్లు, గుంటూరు, విజయవాడతో కలిపి నాలుగు డివిజన్లున్నా జోన్‌కు నోచుకోవడం లేదు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా ఆదాయం ఏటా సుమారు 12 వేల కోట్లు. ఇందులో సగానికి పైగా అంటే రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12-14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ పాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పోర్టు ట్రస్టు, మరొక ప్రయివేటు పోర్టు, అతిపెద్ద స్టీల్‌ప్లాంట్, ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్ వంటివి ఇక్కడే ఉన్నాయి. ఇన్ని ఉన్నా లేనివల్లా అధికార పార్టీ నేతల్లో చిత్తశుద్ధి.. ఉద్యమస్ఫూర్తి.
అర్ధ శతాబ్దం నుంచి...
విశాఖపట్నానికి జోన్ ఏర్పాటు డిమాండ్ ఈనాటిది కాదు.. దాదాపు 50 ఏళ్ల క్రితం అప్పటి లోక్‌సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం తొలిసారిగా పార్లమెంటులో జోన్ డిమాండ్‌ను లేవనెత్తారు. అప్పట్నుంచి జోన్ కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నా అవేమీ కేంద్రం చెవికెక్కడం లేదు. యూపీఏ ప్రభుత్వం 2013 మార్చిలో విశాఖకు రైల్వే జోన్‌పై ఓ కమిటీ వేసింది. ఆ నివేదికపై అతీగతీ లేదు. 2003కి ముందు దేశంలో 9 జోన్లుండేవి. అవి కాలక్రమంలో 17 జోన్లకు పెరిగాయి. కానీ వాటికేమీ కమిటీలు వేయలేదు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయంతో అవి ఏర్పడిపోయాయి. కానీ విశాఖకు జోన్ విషయానికి వచ్చేసరికి ఏటేటా ఏవేవో పితలాటకాలతో వాయిదా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 3, ముంబైలో రెండు జోన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క జోన్ కూడా లేదు. అయినా విశాఖకు జోన్ ఇవ్వడం లేదు.
జోన్‌తో ప్రయోజనాలివీ..
విశాఖకు జోన్ వస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. కొత్తగా రైల్వే లైన్లు వస్తాయి. కొత్త ప్రాజెక్టులూ మంజూరవుతాయి.రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) సెంటరు ఏర్పాటవుతుంది. దీనిద్వారా ‘సి’ తరగతి ఉద్యోగాల నియామకాలకు వీలుంటుంది.రైల్వే రిక్రూట్‌మెంట్ సెంటరు కూడా వస్తుంది. దీంతో నాలుగు తరగతి (సి) నియామకాలు జరుపుకోవచ్చు.జనరల్ మేనేజర్ కార్యాలయం ఏర్పాటవుతుంది. దీంతో ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొత్తగా రెండు, మూడు వేల క్వార్టర్ల నిర్మాణం జరుగుతుంది.డిమాండ్ ఉన్న ప్రాంతాలకు రైల్వే బోర్డుతో పనిలేకుండా కొత్త రైళ్లను వేసుకోవచ్చు. దీంతో కొత్త రైళ్ల కోసం బోర్డుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.లోకల్ ట్రైన్లకు కూడా నడుపుకోవచ్చు. విశాఖలో ప్లాట్‌ఫారాల సంఖ్య పెరుగుతుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు పెరుగుతాయి. జోనల్ హాస్పిటల్ ఏర్పాటవుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, అంతకు మించి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విశాఖపట్నం మరింతగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది.