అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 67,203 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 31,752 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 35,551 మంది ఉన్నారు.
ఈ పరీక్షల కోసం 97 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్‌ఐఓ వెంకటేశులు తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు 8.45 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. 8.45 నుంచి 9 గంటల మధ్య వచ్చే విద్యార్థుల పేర్లు, ఆలస్యానికి కారణాలను ఓ రిజిష్టరులో నమోదు చేసిన తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు.
అయితే తొమ్మిది గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు. 8.15 గంటలకంతా పరీక్ష కేంద్రం ఆవరణలోకి చేరుకోవాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, స్క్వాడ్ బృందాలు, డీఈసీ మెంబర్లు, హైపవర్ కమిటీ సభ్యులు మినహా ఇతర సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు వినియోగించరాదని స్పష్టం చేశారు.
తొలిసారిగా ఈ ఏడాది జీపీఆర్ పద్ధతి అమలవుతున్నందున ఎలాంటి పొరబాట్లకు తావివ్వొద్దని సిబ్బందికి సూచించారు. జిల్లాలో 11 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. నాలుగు ఫ్లయింగ్, ఐదు సిట్టింగ్ స్క్వాడ్‌లతో పాటు డీఈసీ మెంబర్లు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తుంటారన్నారు. ప్రశ్నపత్రాలతో పాటు ఇతర సామగ్రి ఇప్పటికే స్ట్రాంగ్‌రూమ్ నుంచి స్టోరేజ్ పాయింట్లకు తరలించామన్నారు. కొందరు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నట్లు తెలిసిందన్నారు. దీనిని సీరియస్‌గా పరిగణించామన్నారు. విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ఆయా కళాశాలల యాజమాన్యాలపై ఉందన్నారు. హాల్‌టికెట్ల పంపిణీ విషయంలో వేధిస్తున్నట్లు ఫిర్యాదులొస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీవీఈఓ వెంకటరమణ, డీఈసీ సభ్యులు వీరభద్రయ్య, సురేష్‌బాబు, మల్లికార్జున, హైపవర్ కమిటీ సభ్యుడు పీ.సూర్యనారాయణ పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
Published Wed, Mar 12 2014 2:34 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement