Intermediate annual exams
-
Telangana: ఇంటర్ అలర్ట్
సాక్షి హైదరాబాద్: వచ్చే నెల 6వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నిబంధనలు, ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పరీక్ష కేంద్రంలో గాలి, వెలుతురు ఉన్న గదులకు మాత్రమే అనుమతిస్తూ సింగిల్ బెంచీ (మూడు ఫీట్లు)కి ఒకరు, పెద్ద బెంచీ (ఐదు ఫీట్లు)కి ఇద్దరు విదార్థులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు మాస్కులు తప్పనిసరి. పరీక్ష కేంద్రంలో విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశావర్కర్స్, ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. డీహైడ్రేషన్ నుంచి రక్షించేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచతున్నారు. పరీక్ష కేంద్రంలోని గదికి 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయిస్తున్నారు. ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణ తీరు పర్యవేక్షించనున్నారు. విద్యార్థులు పరీక్షే కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేందుకు మొబైల్ యాప్ ద్వారా సెంటర్ లొకేషన్ గుర్తింపు ప్రక్రియకు వెసులుబాటు కల్పించారు. రెండు, మూడు రోజుల్లో మొబైల్ యాప్ వివరాలను బోర్డు అధికారులు ప్రకటించనున్నారు. 3.76 లక్షల మంది గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి సుమారు 3,76,245 మంది పరీక్షకు హజరు కానున్నారు. ఇందుకోసం సుమారు 517 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఫస్టియర్, సెకండియర్‌లో కలిపి 153,119 మంది, రంగారెడ్డి జిల్లాలో 115,366 మంది, మేడ్చల్ జిల్లాలో 1,07,760 మంది పరీక్షలకు హజరు కానున్నారు. ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమిస్తున్నారు. సెంటర్ ఒకరు చొప్పున డిపార్ట్మెంట్ అధికారులను, చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రైవేటు విద్యా సంస్ధల కేంద్రాలకు అదనంగా అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. (చదవండి: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు) -
TS: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు: ఇప్పటికైతే హ్యాపీ..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు సులువుగా ఉండటం విద్యార్థుల్లో జోష్ నింపుతోంది. చాలా మంది మంచి మార్కులు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్ పరిధిలోనే ప్రశ్నలుంటున్నాయని చెబుతున్నారు. ఐచ్ఛిక ప్రశ్నలివ్వడం కూడా కలసివస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపైనా ఇదే మాదిరిగా ప్రశ్నలు ఉంటాయని బోర్డు అధికారులు భరోసా ఇస్తున్నారు. సాదాసీదాగా పరీక్షలు రాసేవారు కూడా పాస్ మార్కులు తెచ్చుకోవడం సులభమేనని అధ్యాపకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐచ్ఛిక ప్రశ్నల్లో సమాధానం ఇచ్చేందుకు వీలుగా బోర్డ్ విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌లో పోర్షన్ ఉంటోందని వారు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన, కోవిడ్ వల్ల సిలబస్ పూర్తికాని పరిస్థితులను పరిగణలోనికి తీసుకునే ప్రశ్నపత్రాలు రూపొందించినట్టు అధ్యాపకవర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీలు సైతం ఇప్పటి వరకూ తాము అందించిన స్టడీ మెటీరియల్‌కు బదులు ఇంటర్ బోర్డ్ మెటీరియల్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కన్పిస్తోంది. సోమ, మంగళవారాల్లో జరిగిన లాంగ్వేజ్ పేపర్లలో ప్రశ్నలు తికమక పెట్టేలా లేవని నిపుణులు చెబుతున్నారు. మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టుల్లో ఈ అవకాశాలుండే వీలుందని కొంత సందేహిస్తున్నారు. అయితే, ఇవి కూడా ఇంచుమించు విద్యార్థులను ఇబ్బంది పెట్టబోవని ఇంటర్ బోర్డ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐచ్ఛికాలతో నెట్టుకొచ్చారు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ భాష పరీక్షకు 4,30,563 (మొత్తం 4,59,240) హాజరయ్యారు. తాజా ఇంటర్ పరీక్షలను 70 శాతం సిలబస్ నుంచే ఇస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈమేరకే స్టడీ మెటీరియల్ ఇచ్చింది. అయితే, కొన్ని ప్రశ్నలు మాత్రం ఊహించని విధంగా వచ్చాయని తెలుగు సబ్జెక్టు విద్యార్థులు తెలిపారు. చాయిస్ ఇవ్వడం వల్ల ఆ ప్రశ్నల వల్ల ఇబ్బంది కలగలేదని చెప్పారు. 30 శాతం ప్రశ్నలు ప్రిపేర్ కాని చాప్టర్ల నుంచి వచ్చాయని, వీటిని చాయస్‌గా వదిలేశామని మెజారిటీ విద్యార్థులు ‘సాక్షి’కి తెలిపారు. తొలిరోజు మాత్రం విద్యార్థులు కొంత ఆందోళనగా కన్పించారు. ఆలస్యంగా పరీక్షలు జరగడం ఒకటైతే, పదవ తరగతి పరీక్షలు రాయకుండా ఇంటర్లోకి రావడం మరో కారణంగా అధ్యాపకులు చెబుతున్నారు. పరీక్షలు రాసే అవకాశం చాలా కాలం తర్వాత రావడంతో విద్యార్థుల్లో మొదట ఆందోళన నెలకొందని విశ్లేషిస్తున్నారు. రెండో రోజు మాత్రం ఆ సమస్య కనిపించలేదని ఇన్విజిలేటర్స్ పలువురు తెలిపారు. ఆత్మవిశ్వాసం పెరిగింది.. చాలాకాలం తర్వాత పరీక్షలు రాయాల్సి రావడంతో కొంత ఆందోళన అనిపించింది. బోర్డు మెటీరియల్ ఫాలో అవ్వడం, ప్రశ్నపత్రాలు ఐచ్ఛికాలతో ఉండటం వల్ల మొదటి రెండు పరీక్షలు తేలికగా రాశాం. మిగతా పరీక్షలు తేలికగా రాయగలనన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. –శశాంక్ (విద్యార్థి, దిల్సుఖ్నగర్ పరీక్ష కేంద్రం వద్ద) పాసవడం తేలికే.. ఇప్పటివరకూ జరిగిన రెండు పేపర్లు గతంకన్నా భిన్నంగా ఉన్నాయి. ఎక్కువ భాగం బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్ నుంచే ప్రశ్నలు వచ్చాయి. విద్యార్థులు ఏమాత్రం దృష్టి పెట్టినా తేలికగా పాసయ్యే వీలుంది. ఇతర సబ్జెక్టుల విషయంలోనూ ఇదే పద్ధతి ఉంటే బాగుంటుంది. – జీకే రావు (ప్రైవేటు కాలేజీ లెక్చరర్) -
ఆన్లైన్లో ఇంటర్ పరీక్షలు?
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో ఈ సారి ఎస్ఎస్సీ, హెచ్ఎస్సీ బోర్డు పరీక్షలు ఆన్లైన్లో జరిపేందుకు మహా ప్రభుత్వం యోచిసస్తోంది. వార్షిక పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాల్సి ఉంది. దీంత ఈ సారి బోర్డు పరీక్షలను నిర్వహించడం కష్టమైనప్పటికీ ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించే విషయంపై విద్యా శాఖ నిపుణులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ మీడియాకు తెలిపారు. కాగా, విద్యార్థులందరికి చదువుకునే హక్కు ఉందని, ఏ పాఠశాలైనా ఫీజులు కట్టలేదని విద్యార్థులను క్లాసులు వినకుండా దూరం పెట్టవద్దని ఆమె సూచించారు. ఇలా ఎవరైనా చేసినట్లయితే ఆయా పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 25 శాతం సిలబస్ తగ్గింపు.. కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. విద్యార్థులకు తరగతుల పరంగా ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు అనేక పద్దతులను అవలంభించారు. ముఖ్యంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్, టీవీ, గూగుల్, వాట్సాప్ ఇలా అనేక రకాలుగా 2020–2021 విద్యాసంవత్సరం విద్యార్థులుకు బోధన జరుగుతోంది. ఇలా వివిద పద్దతులు, మాధ్యమాల ద్వారా 82 శాతం విద్యార్థులకు విద్యాబోధన జరుగుతోంది. మరోవైపు ఇటీవలే నవంబర్ 23వ తేదీ నుంచి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు పాఠశాలలు కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా కారణంగా అనేక ప్రాంతాల్లో పాఠశాలలు మరికొన్ని రోజులపాటు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకోగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రత్యక్షంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ సారి కరోనా నేపథ్యంలో 25 శాతం సిలబస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి తగ్గించింది. అయితే ఎస్ఎస్సీ, హెచ్ఎస్సీ బోర్డు పరీక్షలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహిస్తారు. కానీ, ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలలు పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. కానీ, ఆఫ్‌లైన్, ఆన్లైన్లలో విద్యాబోధన జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎస్ఎస్సీ, హెచ్ఎస్సీ బోర్డు పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించాలని విద్యా శాఖ యోచిస్తోంది. చదవండి: (ఆయన పాలన నల్లేరు మీద నడకలా సాగలేదు) ఎలా నిర్వహిస్తారు? ఆన్లైన్ తరగతుల విషయంపై ఇప్పటికే విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులలో అయోమయం ఉంది. ఇదిలా ఉన్నప్పటికీ ఈ సారి ఎస్ఎస్సీ, హెచ్ఎస్సీ బోర్డు పరీక్షలు ఆన్లైన్ లో నిర్వహించాల న్న ప్రస్తావన రూపొం దించారు. అయితే ఎస్ఎస్సీ, హెచ్ఎస్సీలో అనేక సబ్జెక్టులుంటాయి. అదేవిధంగా అనేక భాషలున్నాయి. దీంతో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం కష్టసాధ్యం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నింటిపై అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనా అనే విషయంపై కూడా ఆలోచిస్తున్నట్టు వర్షా గైక్వాడ్ తెలిపారు. ఈ విష యంపై చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. చదవండి: (రేపు శివసేనలోకి ఊర్మిళ) -
విచారణ కమిటీ ముందుకు అశోక్‌కుమార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తన విచారణను ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు కార్యాలమంలో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. కమిటీ విచారణకు వచ్చిన సమయంలో హైకోర్టు విచారణ నిమిత్తం ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టు విచారణ ముగియడంతో అశోక్‌కుమార్ బోర్డు కార్యాలయానికి చేరుకొని విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణం ఏమిటి? ఎలాంటి అవకతవకలు జరిగాయో? అవకతవకలు, నిర్లక్ష్యం, అక్రమాలకు బాధ్యులెవరు? అన్న కోణంలో కమిటీ అశోక్‌కుమార్ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. వెనుక గేటు నుంచి విచారణకు గ్లోబరీనా సీఈవో! ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గ్లోబరీనా సంస్థ సీఈవో రాజు ఇంటర్ బోర్డు కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం ప్రధాన గేటు నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు లోపలికి వెళ్లగా.. గ్లోబరీనా సీఈవో రాజు మాత్రం వెనుక ఉన్న ఓ చిన్న గేటు నుంచి కార్యాలయం లోపలికి వెళ్లారు. ప్రస్తుతం బోర్డు కార్యాలయంలో సాగుతున్న కమిటీ విచారణలో ఆయన పాల్గొన్నట్టు తెలిసింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా సంస్థనే కారణమని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం.. నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేసింది. డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇంటర్ బోర్డు కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళంపై కమిటీ వివరాలు సేకరించింది. త్రిసభ్య కమిటీ విచారణ నిమిత్తం బోర్డు కార్యాలయానికి చేరుకున్న సమయంలో.. అశోక్‌కుమార్ అక్కడ లేరు. బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. ఆయన లేని సమయంలోనే త్రిసభ్య కమిటీ కార్యాలయంలో విచారణ చేపట్టడం గమనార్హం. ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల దిగజారుడు ప్రవర్తన ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద పోలీసులు దిగజారి ప్రవర్తించడం.. తీవ్ర విమర్శలకు తావిచ్చింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బోర్డు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్‌ను కార్యాలయంలోకి వెళ్లకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని మాత్రం వెంటబెట్టుకొని మరి బోర్డు కార్యాలయం లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. అది కూడా కార్యాలయంలో త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీనిపై పోలీసులను మీడియా ప్రశ్నించడంతో సదరు టీఆర్ఎస్ నేతను బయటకు తీసుకొచ్చారు. మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ ఆందోళన ఇంటర్ ఫలితాల్లో అవకతవకల నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ఉచితంగా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి. -
ఫిబ్రవరి 27 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విశాఖలో విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ప్ర«థమ, 28 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 10,06,449 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతన్నారన్నారు. వీరిలో 5,25,729 మంది ప్రథమ, 4,80,720 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1,448 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్షలు జనవరి 28న, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 30న ఉంటుందన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 67,203 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 31,752 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 35,551 మంది ఉన్నారు. ఈ పరీక్షల కోసం 97 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్ఐఓ వెంకటేశులు తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు 8.45 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. 8.45 నుంచి 9 గంటల మధ్య వచ్చే విద్యార్థుల పేర్లు, ఆలస్యానికి కారణాలను ఓ రిజిష్టరులో నమోదు చేసిన తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. అయితే తొమ్మిది గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు. 8.15 గంటలకంతా పరీక్ష కేంద్రం ఆవరణలోకి చేరుకోవాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, స్క్వాడ్ బృందాలు, డీఈసీ మెంబర్లు, హైపవర్ కమిటీ సభ్యులు మినహా ఇతర సిబ్బంది ఎవరూ సెల్ఫోన్లు వినియోగించరాదని స్పష్టం చేశారు. తొలిసారిగా ఈ ఏడాది జీపీఆర్ పద్ధతి అమలవుతున్నందున ఎలాంటి పొరబాట్లకు తావివ్వొద్దని సిబ్బందికి సూచించారు. జిల్లాలో 11 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. నాలుగు ఫ్లయింగ్, ఐదు సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు డీఈసీ మెంబర్లు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తుంటారన్నారు. ప్రశ్నపత్రాలతో పాటు ఇతర సామగ్రి ఇప్పటికే స్ట్రాంగ్‌రూమ్ నుంచి స్టోరేజ్ పాయింట్లకు తరలించామన్నారు. కొందరు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నట్లు తెలిసిందన్నారు. దీనిని సీరియస్‌గా పరిగణించామన్నారు. విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ఆయా కళాశాలల యాజమాన్యాలపై ఉందన్నారు. హాల్‌టికెట్ల పంపిణీ విషయంలో వేధిస్తున్నట్లు ఫిర్యాదులొస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీవీఈఓ వెంకటరమణ, డీఈసీ సభ్యులు వీరభద్రయ్య, సురేష్‌బాబు, మల్లికార్జున, హైపవర్ కమిటీ సభ్యుడు పీ.సూర్యనారాయణ పాల్గొన్నారు.