ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ (ఎంపీసీ, బైపీసీ) విద్యార్థులకు ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 4వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతాయి. విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా మొత్తం 97 ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 62 కేంద్రాలను అన్‌ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో, మిగిలిన 35 కేంద్రాలను ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్ పరీక్షలకు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 18,243 మంది హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 14,426 మంది ఉన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే ఎంపీసీ విద్యార్థుల్లో 12,462 మంది అన్‌ఎయిడెడ్ జూనియర్ కళాశాలల విద్యార్థులు కాగా, 822 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్నారు.
మోడల్ స్కూళ్ల నుంచి 135 మంది, సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నుంచి 272 మంది, ఎయిడెడ్ జూనియర్ కళాశాల నుంచి 418, కాంపోజిట్ కళాశాల నుంచి 27, కోఆపరేటివ్ జూనియర్ కళాశాల నుంచి 262, ఇన్‌సెంటివ్ జూనియర్ కళాశాల విద్యార్థులు 18 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. బైపీసీ విద్యార్థులు 3,817 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 2,558 మంది అన్‌ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులు కాగా, 587 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, మోడల్ స్కూలు జూనియర్ కళాశాల నుంచి 93, సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నుంచి 269, ఎయిడెడ్ జూనియర్ కళాశాల నుంచి 183 మంది, కాంపోజిట్ జూనియర్ కళాశాల నుంచి 18, కోఆపరేటివ్ జూనియర్ కళాశాల నుంచి 109 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ఎంపీసీ విద్యార్థులకు 60 మార్కులకు, బైపీసీ విద్యార్థులకు 120 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో ఒక్కో సబ్జెక్టుకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్ పరీక్షలుంటాయి.
మారిన నిబంధనలు
ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఈ ఏడాది నిబంధనలను మార్చింది. ఇప్పటి వరకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్లను ఇంటర్మీడియెట్ బోర్డు నియమిస్తోంది. ఇంటర్నల్ ఎగ్జామినర్లుగా(స్కిల్ అసిస్టెంట్) ఆయా కళాశాలలోని సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులు వ్యవహరిస్తారు. ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డిపార్టుమెంటల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. అయితే అన్‌ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసే ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలకు ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఆర్ట్స్ అధ్యాపకులు, ఫిజికల్ డెరైక్టర్లను డిపార్టుమెంట్ అధికారులుగా గత ఏడాది వరకు నియమించారు. ఈ ఏడాది రెవెన్యూ అధికారులను డిపార్టుమెంట్ అధికారులుగా నియమించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి లేఖలు కూడా రాసింది. గత ఏడాది నిజామాబాద్ జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో వివాదం రావడంతో అక్కడి డిపార్టుమెంట్ ఆఫీసర్లను తొలగించి, వారి స్థానంలో రెవెన్యూ అధికారులను నియమించడంతో పక్కాగా నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్‌ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలకు రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను డిపార్టుమెంట్ అధికారులుగా నియమించాలని బోర్డు నిర్ణయించింది. అయితే డిపార్టుమెంట్ అధికారులుగా జూనియర్ అధ్యాపకులను తప్పించి ఇతర శాఖల అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను అన్‌ఎయిడెడ్ జూనియర్ కళాశాలల పరీక్ష కేంద్రాలకు డిపార్టుమెంట్ ఆఫీసర్లుగా నియమించకపోతే ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటామని, జవాబు పత్రాల మూల్యాంకనానికి కూడా హాజరు కాబోమని జూనియర్ అధ్యాపకుల సంఘ రాష్ట్ర శాఖ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శికి నోటీస్ కూడా ఇచ్చిందని జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి
Published Mon, Jan 19 2015 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM
Advertisement
Advertisement