సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీల ముఖ్యనేతలు జిల్లాపై కన్నేయడంతో సార్వత్రిక ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విభజన, సమైక్యవాదం ఎన్నికల్లో ప్రధానాంశాలు కాగా.. జిల్లాలో ‘ప్రత్యేకవాదం’ ప్రభావం పెద్దగా లేదని భావిస్తున్న ప్రముఖ పార్టీల సీనియర్లు ఇక్కడినుంచి బరిలోకి దిగేందుకు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాలోని చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట రీ సెగ్మెంట్లు పట్టణ ప్రాంతాలతో మిళితం కావడం... విద్యావంతులు, ఉద్యోగులు గణ నీయంగా ఉండడంతో చైతన్యం ఎక్కువగా ఉంటుందని రాజకీయపక్షాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా జాతీయస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేస్తాయని అంచనా వేస్తున్నాయి. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చెప్పుకోదగ్గస్థాయిలో వేళ్లూనుకోలేకపోతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగినా.. ఇక్కడి ఓటర్లను పెద్దగా ప్రభావితం చేయదనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో నెలకొంది.
దీంతో చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాల నుంచి పోటీచేసేందుకు అన్ని పార్టీల్లోనూ ఆశావహుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ రెండు లోక్‌సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు/మంత్రులను కూడా కాదని పలువురు నేతలు ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్నారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి ఈసారి ఇక్కడి నుంచి పోటీచే యకపోవచ్చనే గంపెడాశతో మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి, ఎన్‌డీఆర్‌ఎఫ్ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్య ఈ స్థానంపై గురిపెట్టారు. గత ఎన్నికల్లో ఈ సీటును ఆశించిన మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ కూడా చేవెళ్ల టికెట్ రేసులో ఉన్నారు.
వీరేకాకుండా టీఆర్‌ఎస్ గనుక కాంగ్రెస్‌లో విలీనమైతే..ఆ పార్టీ నుంచి ఈ సీటును ఆశిస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం కాంగ్రెస్ తరఫున టికెట్ రేసులో ప్రధానంగా నిలిచే అవకాశం లేకపోలేదు. మరోవైపు తెలుగుదేశం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. చివరి నిమిషంలో ఈయన పోటీ చేయని పక్షంలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నేతలకు ఈ సీటు ఖరారయ్యే అవకాశముంది. మరోవైపు బీజేపీ తరఫున ఆ పార్టీ వృద్ధసింహం బద్దం బాల్‌రెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అయితే, మోడీ నేతృత్వంలోని బీజేపీ సారథ్య బృందం ఈసారి సీనియర్లను బరిలో దించకూడదని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ కూడా ఈ సీటుపై కన్నేశారు. ఇదిలావుండగా, రాజ్యసభ మాజీ సభ్యుడు గిరీష్ సంఘీ సైతం బీజేపీ పక్షాన చేవెళ్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం కాని పక్షంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన అభ్యర్థిత్వానికి కేసీఆర్ ఇదివరకే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తరుణంలో ఆయన పోటీ లాంఛనమే.
ఇక్కడినుంచి అగ్రనేతలే!
ఇక మల్కాజిగిరి పార్లమెంటు సీటుపై పలు పార్టీల కీలక నేతలు కన్నేశారు. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ స్థానం పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలని ఉబలాటపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీతో పొత్తు దాదాపు ఖరారైన ట్లు సంకేతాలు రావడంతో మోడీ ప్రభంజనం తనకు కలిసివస్తుందని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా చంద్రబాబుకు తగిన ప్రాధాన్యమిస్తామని బీజేపీ అగ్రనాయకత్వం చెప్పినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో తనకు ‘సేఫ్టీజోన్’గా మల్కాజిగిరి సీటును ఎంచుకున్నట్లు రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. చంద్రబాబు గనుక ఇక్కడి నుంచి పోటీకి దిగని పక్షంలో యువ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి లైన్‌క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ విద్యాసంస్థల అధిపతి మల్లారెడ్డి కూడా మల్కాజిగిరి స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇంకా టీడీపీ తీర్థం పుచ్చుకోని ఆయన ఈ అంశంపై పార్టీ నేతలు దేవేందర్‌గౌడ్ తదితరులతో సంప్రదింపులు జరిపారు.
పొరుగు జిల్లాల నేతలను రంగారెడ్డి జిల్లా నుంచి పోటీచేయకుండా నిలువరించే ఉద్దేశంతో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఇక్కడినుంచి పోటీకి కుతూహలపడుతున్న రేవంత్‌ను కట్టడి చేసేందుకు తానే బరిలో ఉంటాననే ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. కాగా, అధికార పార్టీలోనూ ఈ సీటుపై రసవత్తర రాజకీయం నడుస్తోంది. సిట్టింగ్ ఎంపీ, మంత్రి సర్వే సత్యనారాయణ మళ్లీ తానే పోటీచేస్తానని స్పష్టం చేస్తుండగా... ఆయన సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు మాత్రం సర్వేకు సీటివ్వొద్దని అధిష్టానం దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఆయన అవినీతి చిట్టాను ఫిర్యాదుల రూపంలో ఏఐసీసీ పెద్దలకు నివేదించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ ఎమ్మెల్యే, నటి జయసుధను ఎంపీగా పోటీ చేయించేందుకు మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
జయసుధ మాత్రం ఈ విషయంలో ఇంకా ఏమీ తేల్చుకోకపోగా, టీఆర్‌ఎస్‌లో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతుండడం గమనార్హం. మరో ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ సైతం మల్కాజిగిరి సీటుపై కన్నేయడం. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కూకట్‌పల్లి నుంచి మళ్లీ పోటీచేస్తారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించినప్పటికీ, తాజాగా ఆయన ఎంపీగా బరిలో ఉంటారని సంకేతాలు వెలువడుతుండడం విశ్లేషకులను సైతం విస్మయపరిచింది. టీడీపీ, బీజేపీతో మైత్రి కుదుర్చుకోవడం ద్వారా గట్టెక్కేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు పేర్లు పరిశీలనలో ఉండగా.. అనూహ్య పరిణామాల మధ్య ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా పోటీచేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతల పేర్లు తెరమీదకు వస్తుండగా.. చంద్రబాబు బరిలో దిగితే టీజేఏసీ చైర్మన్ కోదండరాంను రంగంలోకి దింపే అంశాన్ని తెలంగాణ సంఘాలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హాట్ సీట్లు!
Published Sun, Feb 9 2014 1:44 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement