
జన్మభూమిలో ప్రొటోకాల్ రగడ
చందోలు(పిట్టలవానిపాలెం) : మండలంలోని చందోలులో బుధవారం జరిగిన జన్మభూమి -మా ఊరు కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు. అధికార పార్టీ నేతలు తమను ఎవరేం చేస్తారంటూ ధీమాతో అధికారుల మాటలను సైతం లెక్క చేయడం లేదు. చందోలులో జరిగిన గ్రామసభకు ప్రొటోకాల్ పాటించాలని జెడ్పీటీసీ సభ్యుడు అధికారులకు చెబుతున్నా పట్టించుకోకుండా బాపట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అన్నం సతీష్ ప్రభాకర్‌ను వేదికపైకి ఆహ్వానించి పింఛన్లను పంపిణీ చేయించడంతో అప్పటివరకూ వేదికపై ఉన్న చందోలు ఎంపీటీసీ సభ్యులు షబానా బేగంబాజి,వీరయ్య,జెడ్పీటీసీ సభ్యుడు చిరసాని నారపరెడ్డి గ్రామసభను బహిష్కరించారు.
ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. పార్టీ నాయకుడిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించడమేమిటని సూటిగా ప్రశ్నించారు.ఈ విషయంపై ఎంపీడీఓ శివనారాయణ మాట్లాడుతూ వేదికపైకి పార్టీ నాయకులు రాకూడదని చెబుతూనే ఉన్నానని, గ్రామసర్పంచ్ హోదాలో ఉన్న వారు ఆహ్వానించారని చెప్పారు.