నెల్లూరు(విద్య) : ఇంటర్మీడియట్ 2015 పబ్లిక్ పరీక్షలు మార్చి 11వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ వై.పరంధామయ్య తెలిపారు. నగరంలోని కేఏసీ ప్రభుత్వ కళాశాలలో గురువారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 4 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. సెల్ఫ్‌సెంటర్లలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకచర్యలు చేపడుతున్నామన్నారు. ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 33,000 మంది, సెకండియర్ 25,349 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్ 1092 మంది, ద్వితీయ సంవత్సరం 914 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 57,385 మంది విద్యార్థులు జిల్లావ్యాప్తంగా పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
పరీక్షల కమిటీ.. ఫ్లైయింగ్, స్టిట్టింగ్..స్క్వాడ్‌లు ఏర్పాటు...
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా పరీక్షల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌ఐఓ కన్వీనర్‌గా ఇద్దరు ప్రిన్సిపాళ్లు, ఒక లెక్చరర్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఈ పరీక్షల కమిటీ నిరంతరం కృషిచేస్తుందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించామన్నారు. మొత్తం 94 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 94 మంది డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించామన్నారు.
22 స్టోరేజ్ పాయింట్స్ (పోలీసు స్టేషన్లలో)లకు కస్టోడియన్లను ఏర్పాటుచేశామన్నారు. హైపవర్ కమిటీ నియమించామన్నారు. నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 5 సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజూ 50 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసే విధంగా స్క్వాడ్‌ల కార్యచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. ఏజేసీ, డీఆర్‌ఓ, పోలీసుశాఖ, ఆర్టీసీ, పోస్టల్, ఆరోగ్య, మున్సిపాల్టీ, డీపీఆర్‌ఓ తదితర డిపార్ట్‌మెంట్‌ల సమన్వయంతో పరీక్షలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సెల్‌ఫోన్లు తీసుకురాకూడదన్నారు. అధ్యాపకులు సెల్‌ఫోన్లను స్విచ్‌ఆఫ్ చేసి చీఫ్ సూపరింటెండెంట్లకు అప్పగించాలన్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
పరీక్షల నిర్వహణ సమాచారం పొందేందుకు, ఫిర్యాదులు చేసేందుకు ఆర్‌ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశామన్నారు. 0861-2320312 నంబరుకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునన్నారు. జీపీఎస్ (గ్లోబల్ పొల్యూషనింగ్ సిస్టం) అమలు చేస్తున్నామన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, అడిషనల్ సూపరింటెండెంట్లు, స్క్వాడ్‌లు ఫోన్ సంభాషణలు నేరుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్‌కు నియంత్రణలోకి వెళ్తాయని తెలిపారు. ఈ సందర్భంగా డీవీఈఓ బాబుజాకబ్ మాట్లాడుతూ.. ఎస్‌ఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.
ఎస్‌ఎంఎస్ నంబరు 51969కు క్వశ్చన్ పేపర్ సెట్ నంబరును ఉదయం 8 నుంచి 8.45 లోపు, విద్యార్థుల హాజరును ఉదయం 9.15 నుంచి 9.45 లోపు, మాల్ ప్రాక్టీస్ వివరాలను 12గంటల నుంచి 1గంటలోపు ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు విధిగా అందజేయాలన్నారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లను ఇదివరకే కళాశాలలకు పంపామని తెలిపారు. హాల్ టికెట్లు విద్యార్థులకు అందజేయడంలో ఇబ్బంది పెడితే వారిపై కఠినచర్యలు తప్పవన్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలన్నారు. సెల్‌ఫోన్లు, క్యాలిక్లేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదని సూచించారు. ప్రతి విద్యార్థి విధిగా ఎగ్జామ్ ప్యాడ్‌ను తెచ్చుకోవాలన్నారు. 9గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టమెంట్ ఆఫీసర్లు, ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు బీవీ సుబ్బయ్య, బి.పెంచలయ్య, సీహెచ్ శ్రీనివాసులురెడ్డి, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
11 నుంచి ఇంటర్ పరీక్షలు
Published Fri, Mar 6 2015 1:59 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement